ఆర్బీఐ మరో కీలక నిర్ణయం... ఇకపై ఏటీఎం కేంద్రాల్లో రూ.50 నోట్లు
గురువారం, 10 నవంబరు 2016 (12:51 IST)
భారత రిజర్వు బ్యాంకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎం కేంద్రాల్లో రూ.50 నోట్లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాలని భావిస్తోంది. ఇందుకోసం చర్యలు కూడా చేపట్టింది. ప్రస్తుతం దేశంలో రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని మోడీ ప్రభుత్వం రద్దు చేసిన విషయంతెల్సిందే.
దీంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవాల్టి నుంచి కొత్త నోట్లను జారీ చేస్తుండటంతో కొంతవరకూ ఉపశమనం లభించినట్లైంది. కానీ బ్యాంకుల్లో రూ.2 వేలు, రూ.500 కొత్త నోట్లు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మరి చిల్లర పరిస్థితి ఏంటి? 500, 1000 రూపాయలు రద్దు చేయడంతో జనం చిల్లర నోట్ల కోసం ఎగబడుతున్నారు. ఇలాంటి వారి కోసం ఆర్‌బీఐ ఓ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
అన్ని ఏటీఎం సెంటర్లలో 50 రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటివరకూ 100 నోట్ల సంఖ్యను పెంచిన ఆర్బీఐ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 50 రూపాయల నోట్లను కూడా ఇక నుంచి ఏటీఎంల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించున్నట్లు సమాచారం. అయితే, రోజుకు రూ.2 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా ఓ షరతును విధించనుంది. ఈ నోట్లు ఈనెల 11వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు... నోట్ల రద్దు నిర్ణయంతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. పాత నోట్లు చెల్లక, చిల్లర దొరక్క పడరాని పాట్లు పడ్డారు. అయితే గురువారం ఉదయం నుంచి కొత్త నోట్లు జారీ చేస్తుండటంతో తెల్లవారుజాము నుంచే బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా శని, ఆదివారాలు కూడా బ్యాంకులు పనిచేస్తాయని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ బ్యాంకుకు కొత్త నోట్ల కోసం వెళ్లేవాళ్లకు మరో తీపి కబురందింది. ఉదయం నుంచి రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ ఒక్కరోజు సాయంత్రం 6 గంటల వరకూ నోట్లను ఇస్తామని బ్యాంకు యాజమాన్యం ప్రకటించింది. సాధారణంగా ఎస్‌బీఐ బ్యాంకు సాయంత్రం 4 నుంచి 4.30 లోపు మూతపడుతుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం పనివేళలు పెంచింది. మరో రెండు రోజులు ఈ అదనపు వేళలు వర్తించే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ బ్రాంచిలన్నింటికీ ఈ అదనపు పనిగంటలు వర్తిస్తాయని ఉన్నతాధికారులు ప్రకటించారు. కస్టమర్లు ఐడెంటిటీ డాక్యుమెంట్‌ను నింపి ఇస్తే కొత్త నోట్లను ఇస్తామని తెలిపింది.