పంజాబ్ చండీగఢ్‌కి చెందిన దినేష్ ప్రసాద్ బాటా షోరూంకి వెళ్లి బూట్లు కొనుగోలు చేశారు. వాటి రేటు రూ.402లు, షూస్‌ని పేపర్ బ్యాగ్‌లో పెట్టిస్తూ దాని బ్యాగ్ రేటు రూ.3లు అని బిల్లులో వేశారు. దానికి ఆగ్రహం చెందిన దినేష్ మీ షోరూం ప్రమోషన్ కోసం బాటా లోగో వేసిన ఉన్న బ్యాగ్ ఇస్తూ.. పైపెచ్చు దానికి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అని యాజమాన్యాన్ని నిలదీశాడు.
రూ.3 ఇవ్వనంటూ, బ్యాగ్‌ను ఫ్రీగా ఇవ్వండి అంటూ వాదించాడు. దానికి సదరు యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో కోపంతో దినేష్ వెళ్లి వినియోగదారుల ఫోరమ్‌లో కేసు నమోదు చేశాడు. దినేష్ వాదనను విన్న ఫోరం బాటాకు జరిమానా విధించింది.
పేపర్ బ్యాగ్‌కి బలవంతంగా రూ.3లు వసూలు చేయడం సేవలలో లోపమేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. కస్టమర్‌లు ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు పేపర్ బ్యాగ్‌లను ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది. వ్యాజ్యం కింద రూ.1000, మానసిక ఆందోళనకు రూ.3000, లీగల్ ఎయిడ్ నిధికి రూ.5,000లు, కంప్లైంట్ చేయడానికి అయిన ఖర్చు రూ.1000లు చెల్లించమంటూ బాటాని ఆదేశించింది.
ప్రతి వినియోగదారునికి క్యారీ బ్యాగ్‌ని ఉచితంగా అందించాలంటూ ఆదేశించింది. చాలా స్టోర్‌లలో క్యారీ బ్యాగ్ పేరుతో రూ.3 నుంచి రూ.5లు వసూలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టానుసారంగా వినియోగదారులను నిలువునా దోచేస్తున్నారు. దినేష్ ప్రసాద్ లాంటి వ్యక్తులు సమాజానికి కొత్త మేల్కొలుపును తీసుకురాగలరని నెటిజన్‌లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.