విజయవాడలో ప్యాసెంజర్‌ వాహనాలకు సంబంధించి మొదటి డీలర్‌షిప్‌ ప్రారంభించిన బీవైడీ ఇండియా

గురువారం, 25 ఆగస్టు 2022 (23:14 IST)
విజయవాడ: వారెన్‌ బఫెట్‌ వెన్నంటి ఉన్న బీవైడీకు అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు తమ మొట్టమొదటి డీలర్‌షిప్‌ షోరూమ్‌ను ప్యాసెంజర్‌ వాహనాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రారంభించింది. ఈ డీలర్‌షిప్‌ను పీపీఎస్‌ మోటర్స్‌ నిర్వహిస్తుంది.

 
ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌లోని వినియోగదారులకు బీవైడీ ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను పీపీడీ మోటర్స్‌ అందిస్తుంది. ఆటోమొబైల్‌ పరిశ్రమలో గణనీయమైన అనుభవంతో పీపీఎస్‌ మోటర్స్‌ విస్తృత స్ధాయిలో తమ వ్యాపారాలతో చుట్టుపక్కల ప్రాంతాలను సైతం చేరుకుంది. విజయవాడ వాసులు ఇప్పుడు తమ నగరాన్ని వీడకుండానే అత్యుత్తమ విద్యుత్‌ వాహనాలలో ఒకదానిని కొనుగోలు చేయవచ్చు.

 
ఈ షోరూమ్‌లో సుశిక్షితులైన కన్సల్టెంట్లు ఉన్నారు. అలాగే ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు సైతం ఉండటం వల్ల వినియోగదారులకు అసాధారణ రీతిలో స్టోర్‌ లోపలి అనుభవాలను అందిస్తారు. ఈ షోరూమ్‌  2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా వినియోగదారులు ఆస్వాదించేందుకు ఆహ్లాదకరమైన లాంజ్‌ ఏరియా సైతం ఉంటుంది.

 
బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్‌ ప్యాసెంజర్‌ వెహికల్‌ బిజినెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గోపాలకృష్ణన్‌ మాట్లాడుతూ, ‘‘విజయవాడతో ప్రారంభించి మేము మా లక్ష్యిత వినియోగదారులకు మరింత సన్నిహితంగా వెళ్లనున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో పీపీఎస్‌ మోటర్స్‌తో కలిసి మా మొట్టమొదటి షోరూమ్‌ ప్రారంభించడం పట్ల చాలా  ఆనందంగా ఉన్నాము. మా కస్టమైజ్డ్‌ ఉత్పత్తులు, సేవలు ఈ ప్రాంతంలో హరిత కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాయని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

 
పీపీఎస్‌ మోటర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సంఘ్వీ మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ కోసం బీవైడీతో కలిసి పనిచేయడం పట్ల మేము చాలా ఆసక్తిగా ఉన్నాము మరియు భారతదేశపు ఈవీ విప్లవంలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాము. బీవైడీ నుంచి వచ్చే సరసమైన ఉత్పత్తులతో పాటుగా వినియోగదారుల అవసరాలను లోతుగా అర్థం చేసుకోవడం వల్ల మా వినియోగదారులకు అత్యుత్తమ యాజమాన్య అనుభవాలను అందించడానికి ప్రయత్నిస్తాము’’ అని అన్నారు.

 
జనవరి 2022 నాటికి భారతదేశంలో విద్యుత్‌ వాహనాల విస్తరణ కేవలం 1%గా మాత్రమే ఉంది. భారతదేశంలో 2070 నాటికి నెట్‌-జీరో ఉద్గారాలను సాధించాలనే లక్ష్యంతో, బీవైడీ ఇప్పుడు తమ భాగస్వాములతో అతి సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా స్ధానిక మార్కెట్‌ల కోసం స్థానికీకరించిన హరిత ఉత్పత్తులను అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు