దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ, ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు, 2017ను మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిపారు. రుణాలు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయేవారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, విక్రయించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటవుతుందన్నారు.
మనీలాండరింగ్ చట్టం ప్రకారం ఈ కేసులపై విచారణ జరుగుతుందన్నారు. విదేశాలకు పారిపోయినవారి అన్ని ఆస్తులను, బినామీ ఆస్తులతో సహా, జప్తు చేయడానికి ఈ బిల్లు ప్రతిపాదించిందన్నారు. కంపెనీల చట్టాన్ని కూడా సవరిస్తామని తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే, చట్టం అయిన తర్వాత విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటివారి ఆస్తులను జప్తు చేసి, అమ్మేసి, రుణాలను రాబట్టుకునేందుకు వీలవుతుంది.
కాగా, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ వంటివారు దేశంలోని బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని దేశం వీడిపారిపోతున్న విషయం తెల్సిందే. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి, విదేశాలకు పారిపోయేవారిని నేరస్థులుగా ప్రకటించి, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, అమ్మేసి, రుణాలను రాబట్టుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.