దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు వీలుగా ప్రస్తుతం చెలామణీలో ఉన్న చెక్కులకు స్వస్తి పలుకనున్నారు. ఈ మేరకు ఆయా వ్యాపారవర్గాలకు బ్యాంకులు సమాచారాన్ని చేరవేసినట్టు సమాచారం. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సిఎఐటి) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా ఉన్నాయి.
దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చెక్‌బుక్‌లను రద్దు చేసే అవకాశం ఉందని మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఖండేల్‌వాల్ చెప్పారు. ‘డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కోసం సమీప భవిష్యత్‌లోనే కేంద్ర ప్రభుత్వం చెక్ బుక్కుల సదుపాయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది’ అన్నారు.
ఆర్థిక వ్యవస్థలో నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు మాస్టర్ కార్డు కంపెనీతో కలిసి ప్రారంభించిన డిజిటల్ రథ్ కార్యక్రమం ప్రారంభంలో ఖండేల్‌వాల్ ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం కరెన్సీ నోట్ల ముద్రణ కోసం రూ.25,000 కోట్లు, వాటి రవాణా, భద్రత కోసం మరో రూ.6,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు చెక్కు బుక్కుల విధానానికి స్వస్తి చెప్పే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వెల్లడించారు.