వ్యాపారులకు ఉపశమనం... తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర

సోమవారం, 1 మే 2023 (11:52 IST)
మే ఒకటో తేదీన సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పునఃసమీక్షించాయి. ఇందులోభాగంగా, వ్యాపార అవసరాల నిమిత్తం వినియోగించే వాణిజ్య సిలిండర్ ధర తగ్గింది 19 కేజీల సిలిండర్ ధరను రూ.171.50 మేరకు తగ్గించినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సోమవారం వెల్లడించాయి. ఈ సవరణ తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.1856.50కు చేరుకుంది. ఈ తగ్గిన ధర సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. అలాగే, ముంబైలో రూ.1808.50గాను కోల్‌కతాలో రూ.1960.50కు దిగి వచ్చింది. తగ్గింపు తర్వాత చెన్నైలో విక్రయ ధర రూ.2132గా ఉంది. 
 
నిజానికి ఇదే ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరను ఏప్రిల్ ఒకటో తేదీన కూడా రూ.91.50గా తగ్గించారు. ఇపుడు మరోమారు తగ్గించారు. అదేసమయంలో మార్చి ఒకటో తేదీన వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.350.50 మేరకు పెంచి షాకిచ్చిన విషయం తెల్సిందే. ఈ పెంచిన ధరలో గత రెండు నెలలుగా రూ.263 మేరకు తగ్గించినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు