కరోనా దెబ్బకు కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ.. మాంద్యంలోకి ప్రపంచం!

శనివారం, 28 మార్చి 2020 (11:56 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ బంధించింది. ఈ వైరస్ ఏకంగా 192 దేశాలకు వ్యాపించింది. దీంతో ఈ వైరస్ బారి నుంచి తమతమ దేశాల ప్రజలను కాపాడుకునేందుకు అనేక దేశాలు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ లాక్‌డౌన్ వల్ల అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు స్తంభించిపోయాయి. రోడ్లపై సంచరించే జనాలు కనిపించడం లేదు. 
 
అనేక రహదారుల్లో క్రూరమృగాలు సంచరిస్తున్నాయంటే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, ఈ కరోనా దెబ్బకు అంతర్జాతీయ సరిహద్దులు మూతపడ్డాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ కారణంగా ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం జారుకుంటుందని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి - ఐఎంఎఫ్) హెచ్చరించింది. 
 
ఇదే అంశంపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా స్పందిస్తూ, 2009 ఆర్థిక సంక్షోభం కంటే కరోనా ప్రభావం భారీగానే ఉంటుందన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆక‌స్మికంగా ఏర్ప‌డిన ఆర్థిక ప్ర‌తిష్టంభ‌న వ‌ల్ల‌ తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు మద్దతుగా నిలవాలని ఆర్థిక వ్యవస్థలకు పిలుపునిచ్చారు. 
 
ఈ దేశాలు భారీగా మూలధన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాము 1 ట్రిలియన్ డాలర్ల రుణ సహాయానికి సిద్ధమని తెలిపారు. అటు ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు, సంస్థలు, పరిశ్రమలు మూసివేశారని ఆమె గుర్తుచేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ‌త కొన్ని వారాల్లో 83 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా పెట్టుబ‌డులు త‌ర‌లిపోయాయ‌ని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా మరో ఆర్థిక సంక్షోభం తప్పదని ఆమె హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు