క్రంచీరోల్ సీజన్ సోలో లెవెలింగ్ కోసం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రానా దగ్గుబాటి వాయిస్

ఐవీఆర్

శుక్రవారం, 22 నవంబరు 2024 (20:12 IST)
బాహుబలి, ఘాజీ లాంటి సినిమాలతో భారతీయ ప్రేక్షకులకు చాలా దగ్గరైన విలక్షణ నటుడు రానా దగ్గుబాటి. సినిమాలే కాకుండా టీవీ షోలు, టాక్ షోలతో అనునిత్యం బిజీగా ఉండే రానా ఇప్పుడు భారతీయ యానిమే అభిమానుల కోసం తన గొంతు సవరించుకున్నాడు. ఎంతో ప్రసిద్ధి చెందిన బార్కా ఐస్ ఎల్ఫ్ పాత్రకు రానా తన వాయిస్‌ని ఇచ్చాడు. క్రంచీ రోల్ యొక్క రాబోయే సీజన్ సోలో లెవలింగ్ కోసం తన వాయిస్‌ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందించారు రానా. రానా దగ్గుబాటి తన అద్భుతమైన వాయిస్‌ని హిందీ, తమిళం, తెలుగులో బార్కా పాత్రకు అందించారు. క్రంచ్ రోల్, సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ యొక్క సోలో లెవలింగ్-రీఅవేకనింగ్- ఫ్యాన్ ఓమ్నిబస్ ఫిల్మ్‌‌ని డిసెంబర్ 6, 2024న భారతదేశంలోని థియేటర్‌లకు తీసుకువస్తున్నారు. అయితే ఇక్కడ అభిమానులు ముందుగా రానా హిందీ వాయిస్‌ని ఆస్వాదించవచ్చు.
 
సోలో లెవలింగ్ సీజన్ 2, సోలో లెవలింగ్-రీఅవేకనింగ్- రెండింటిలోనూ చాలా శక్తివంతమైన కేరక్టర్ బార్కా. ఈ కేరక్టర్ ఐస్‌ఎల్ఫ్, రెడ్ గేట్ డూంజియన్‌‌కి బాస్. బార్కా యొక్క కత్తి నైపుణ్యం, వేగం, స్టీల్త్ జిన్‌ వూ యొక్క అభివృద్ధి చెందుతున్న శక్తిని పరీక్షిస్తుంది. ఇది సోలో లెవలింగ్ యొక్క ఎపిక్ స్టోరీ కంటే మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ.. బార్కా పాత్రకు మూడు భాషల్లో వాయిస్‌ని అందించడం చాలా థ్రిల్లింగ్‌గా, ఛాలెంజింగ్‌గా ఉంది. చాలా అద్భుతమైన, ఎంతోమందికి నచ్చిన పవర్ పాత్రను మన హిందీ, తమిళ్, తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అన్నింటికి మించి గతంలో నేను ఎప్పుడూ యానిమే పాత్రకు డబ్బింగ్ చెప్పలేదు. దీనిద్వారా ఇప్పుడు నేను యానిమే అభిమానులకు కూడా దగ్గరయ్యాను. ఈ అనుభూతి నాకు మొదటిసారి. మరి ఆడియన్స్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఎదురుచూస్తున్నాను అని అన్నారు ఆయన.
 
ఈ సందర్భంగా క్రంచీరోల్ ఏపీఏసీ, సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ అక్షత్ సాహు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. “హిందీ, తమిళం, తెలుగులో అద్భుతమైన బార్కా పాత్రకు... అంతే పవర్‌ఫుల్ అయినటువంటి రానా దగ్గుబాటి వాయిస్ అందించడం, ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలో సాంస్కృతికంగా ప్రతిధ్వనించే యానిమే ఎక్స్‌పీరియన్స్‌ను ఆయన ద్వారా అందించాలన్న నిబద్ధతకు ఈ ప్రయాణమే నిదర్శనం. పెద్ద, చిన్న స్క్రీన్‌లలో భారతీయ ప్రేక్షకులకు నిజంగా లీనమయ్యే, యాక్సెస్ చేయగల యానిమే అనుభవాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము” అని అన్నారు ఆయన.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు