ఫాస్ట్ ట్యాగ్: టోల్ చెల్లింపులు తప్పనిసరి.. అసలు ఛార్జీకి రెండింతలు

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (10:55 IST)
వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం విధించిన గడువు ముగియనుంది. ఈ గడువును మరోసారి పొడిగించబోమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం నాడు స్పష్టమైన ప్రకటన చేశారు. ఫలితంగా.. ఇకపై ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాదారులు అసలు టోల్ చార్జీకి రెండింతలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సోమవారం అర్థరాత్రి నుంచి టోల్ చెల్లింపులు సరళతరం చేసే ఫాస్ట్ ట్యాగ్ విధానం తప్పనిసరి కానుంది. 
 
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ప్రవాహాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో టోల్ గేట్ల వద్ద ఉండే ప్రత్యేకమైన సెన్సర్లు వాహనంపై అమర్చిన ఫాస్ట్‌ట్యాగ్‌ను రీడ్ చేసి టోల్ చార్జీలను స్వీకరిస్తాయి. ఈ మొత్తం వ్యవహారం ఆటోమెటిక్ విధానంలో, టోల్ సిబ్బంది కలుగ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే జరిగిపోతుంది. 
 
ప్రీపెయిడ్ విధానంలో ప్రేశపెట్టిన ఈ ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యాలెట్లలో నగదు అయిపోయిన ప్రతిసారీ వాహనదారులు రీచార్జ్ చేయడం ద్వారా నగదు నింపాల్సి ఉంటుంది. టోల్ గేట్ సిబ్బందికి చెల్లింపులు జరిపే పాత విధానాని ఫాస్ట్ ట్యాగ్‌ పద్ధతి ముగింపు పలకనుంది. ఫలితంగా.. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాల్సిన అగత్యం తప్పి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు