ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కేంద్రం ఓ చట్ట సవరణ చేసింది. దీనివల్ల రుణ పరిమితి పెరగనుంది. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ అనేక రకాలైన సమస్యల్లో చిక్కుకున్న విషయంతెల్సిందే. ఇందులోభాగంగా, తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీకి కేంద్రం నుంచి అందేసాయంతో పాటు... తీసుకోబోయే రుణ పరిమితిని పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని పదేపదే కోరుతూ వచ్చింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి.. చట్ట సవరణ చేసింది.
గతంలో దేశంలో కూడా ఆర్థికలోటు ఉండడంతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం తన చట్టాన్ని సవరించుకుంది. అదేసమయంలో దేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాలకు కూడా ఎఫ్ఆర్‌బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) పరిధిని పెంపునకు కేంద్రం అనుమతిచ్చింది. ఎప్‌ఆర్‌బీఎం అనుమతిని పెంచడానికి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది.
ఎప్‌ఆర్‌బీఎం పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతం వరకు పెంచితే రాష్ట్రానికి అదనంగా మరో 3 వేల కోట్లు రూపాయల రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక వేళ కేంద్రం అనుమతిస్తే డిసెంబర్ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఎప్‌ఆర్‌బీఎం చట్టానికి సవరణ తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వ సన్నద్ధమవుతోంది.