త్వరలోనే పెట్రో భారం నుంచి ఉపశమనం : కేంద్రం మంత్రి పూరి

బుధవారం, 25 ఆగస్టు 2021 (14:09 IST)
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ చమురు ధరల ప్రభావం అన్ని రకాల నిత్యావసరసరుకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో నిత్యావసరవస్తు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రయాణ చార్జీలు కూడా భారమవుతున్నాయి. అంటే.. ఈ చమురు ధరలు పెదోడి నుంచి పెద్దోడి వరకు ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోలు, డీజిల్‌ ధరల విషయంలో దేశ ప్రజలు త్వరలో శుభవార్త వింటారన్నారు. రానున్న కొద్ది నెలల్లో వాటి ధరల భారం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందన్నారు. 
 
అంతర్జాతీయంగా చమురు ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయని గుర్తుచేశారు. పెట్రో ధరల అంశాన్ని ప్రభుత్వం అత్యంత సున్నితమైనదిగా భావిస్తుందన్నారు. మరోవైపు, ఇంధనాలపై సుంకాల పెంపును మంత్రి సమర్థించుకున్నారు. 
 
లీటరు పెట్రోల్‌పై ప్రభుత్వం రూ.32 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తుందని.. తద్వారా సమకూరిన డబ్బును ఉచిత రేషన్, టీకా కార్యక్రమం, వివిధ సంక్షేమ పథకాల కోసం వినియోగిస్తుందన్నారు. 
 
2010 ఏప్రిల్‌లో నాటి సర్కారు లీటరు పెట్రోల్‌పై రూ.32 సుంకం విధించేదని, ఇప్పుడూ అంతే మొత్తాన్ని తమ ప్రభుత్వం విధిస్తుందని హర్దీప్‌ సింగ్‌ గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు