పండగ సీజన్‌లో పరుగులు పెడుతున్న బంగారం ధరలు

ఠాగూర్

గురువారం, 26 సెప్టెంబరు 2024 (19:18 IST)
దేశ వ్యాప్తంగా ఫెస్టివల్ మూడ్ నెలకొంది. ఈ సమయంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గురువారం మరోమారు ఈ ధరలు పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.400 పెరిగి రూ.78 వేల మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడం, దేశీయంగాను వర్తకుల నుంచి కొనుగోళ్లు కొనసాగుతుండటంతో పసిడి రెక్కలు రావడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
బుధవారం రూ.77,850 వద్ద ముగిసిన బంగారం గురువారం మరో రూ.400 పెరిగి తాజా గరిష్ఠమైన రూ.78,250 మార్కును దాటినట్లు ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. మరోవైపు వెండికీ పసిడితో సమానంగా డిమాండ్‌ కొనసాగుతోంది. కిలో వెండి తాజాగా మరో వెయ్యి రూపాయలు పెరిగి రూ.94 వేల మార్కు చేరుకోవడం గమనార్హం. 
 
ద్రవ్యోల్బణం కట్టడికి ఇన్నాళ్లూ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర బ్యాంకులు... ఇప్పుడు వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు ముందుకొస్తున్నాయి. దీనికితోడు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా పసిడికి డిమాండ్‌ ఏర్పడిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు