సాధారణంగా బ్యాంకులో లోన్ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అదే ప్రభుత్వరంగ బ్యాంకులో అయితే సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు. ప్రభుత్వ బ్యాంక్‌ల నుండి రుణం పొందడానికి బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) రుణాలు తీసుకునే వారికి తియ్యటి కబురు చెప్పింది.
వచ్చే పండుగ సీజన్‌లో లోన్ తీసుకునే వారిని ఆకర్షించడమే లక్ష్యంగా హౌసింగ్, వాహన రుణాలను తక్కువ వడ్డీకే అందించడంతో పాటు రుణాల తిరిగి చెల్లింపు కాలం కూడా సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది. రుణాలు తీసుకునే వారి సంఖ్యను పెంచేందుకు ఏకంగా గృహ, వాహన రుణాలను 59 నిమిషాల్లో అందించడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
ఎస్‌బిఐతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్‌లు, psbloansin59minutes పోర్టల్ ద్వారా చిన్న, మధ్య స్థాయి వ్యాపారవేత్తలకు ప్రస్తుతం కోటి రూపాయల వరకు రుణాలను అందిస్తుండగా, ఈ పరిధిని ఇకపై రీటైల్ రుణాలకు సైతం వర్తింపజేయనున్నట్లు బ్యాంక్‌లు ప్రకటించాయి.
హౌసింగ్, వాహన రుణాలను కూడా ఈ పోర్టల్ పరిధిలోకి తీసుకురానున్నట్లు ఎస్‌బిఐ అధికారులు తెలియజేసారు. లోన్ ప్రాసెస్ ప్రక్రియను 59 నిమిషాల్లో పూర్తి చేసి, సంబంధిత సంస్థలకు వారం రోజుల్లోగానే రుణాన్ని మంజూరు చేయనున్నారు.