నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై 2022, జనవరి 1 నుంచి కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో మోయ లేని భారం మోపనుంది. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని మొదట అమల్లోకి తీసుకొచ్చినప్పుడు 5 శాతం పన్ను మోపింది. దీన్ని జనవరి 1, 2022 నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పన్నుల పెంపుదల వల్ల అసంఘటిత రంగంలోని చేనేత, జౌళి, పాదరక్షల ఉత్పత్తుల అమ్మకాలకు గడ్డు కాలం రానుంది. దీని ప్రకారం ఇకపై ఆన్‌లైన్, ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా పొందే సేవలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే.
స్విగ్గీ, జొమోటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి వాటి ద్వారా పొందే సేవల పైనా, ట్రాన్స్‌పోర్టు రంగంలో ఉన్న ఓలా, ఊబెర్ సంస్థలు అందించే సేవల పైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే.
కరోనా వల్ల ఇప్పటికే కుదేలైన మోటారు రంగంపై ఈ భారం మోయలేనిది. ఒక పక్క గ్యాస్ ధరలు, మరోపక్క జీఎస్టీ పెంపుదలతో హోటల్ రంగానికి కూడా ఇకపై గడ్డుకాలమే. కరోనా వల్ల కుదేలైన పర్యాటక రంగానికి జీఎస్టీని పెంచడం చేదు వార్తే.