దేశంలోని నల్లదొంగలకు అర్థరాత్రి స్వాంత్ర్యం వచ్చింది. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసిన తర్వాత తమ వద్ద ఉన్న కరెన్సీ కట్టలను నల్లదొంగలు బయటకు తీశారు. నగరాలు, పట్టణాల్లో నల్ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వీలు పడక పోవడంతో జిల్లాల్లోని సహకార బ్యాంకులను ఎంచుకున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 17 రాష్ట్రాల్లోని సహకార బ్యాంకుల్లో నవంబర్ 10 నుంచి 15 మధ్యలో 9 వేల కోట్ల డిపాజిట్ చేశారు. నవంబర్ 9 నుంచి దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 5 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయలు సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు ఆదాయపన్ను శాఖ అధికారుల లెక్కల్లో తేలింది.
ఒక్క కేరళ రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లోనే దాదాపు రూ.18 వందల కోట్లు డిపాజిట్ అయినట్లు బయటపడింది. అలాగే, పంజాబ్‌లో రూ.1268 కోట్లు, మహారాష్ట్రలో రూ.1,128 కోట్ల నల్ల డబ్బు సహకార బ్యాంకు ఖాతాల్లోకి మళ్లింది. నల్ల దొంగలంతా సహకార బ్యాంకు యాజమాన్యాలతో కుమ్మక్కై వేల కోట్లు భద్రంగా దాచుకున్నట్టు తేలింది.