దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే, లీటరు పెట్రోల్ ధర రూ.120ని మించిపోయింది. డీజిల్ ధర కూడా రూ.110ని దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది.
దీంతో దీపావళి పండుగ బహుమతి పేరుతో లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.5, పెట్రోల్‌పై రూ.10 చొప్పున కేంద్రం తగ్గించింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పెంచింది కొండంత... తగ్గించింది గోరంత అంటూ విపక్ష నేతలు విమర్శలు దిగారు. అదేసమయంలో ఎన్డీయేతర రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గిచేందుకు ససేమిరా అంటున్నాయి. ఇదిలావుంటే, కేంద్ర చమురు సంస్థలు కూడా రోజువారీ వడ్డింపునకు తాత్కాలిక స్వస్తి చెప్పాయి. ఫలితంగా రికార్డు స్థాయిలో ఏడో రోజు కూడా చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.