కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేతుల్లో డబ్బుల్లేక మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా పేదలు ఆహారం లేకుండా నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం లభించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఉద్యోగులకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది.
పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నామని, కేవలం మూడు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో నగదు వేస్తున్నామని హైదరాబాద్ పిఎఫ్ కమిషనర్ చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 వేల 647 మంది ఉద్యోగులు పిఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ కలిపి 258 కోట్ల రూపాయలు ఏప్రిల్ 30వ తేదీ నాటికి వారి బ్యాంకు అకౌంట్లలో వేశామని వివరించారు.