ఆమెను ఊరూవాడా ఛీకొట్టింది, చివరకు చెరువులో దూకింది, పోలీసులే దేవుళ్లులా...
గురువారం, 30 ఏప్రియల్ 2020 (23:48 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, పెద్ద గొల్ల గూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే దమ్మపేట మండలం,పెద్ద గొల్లగూడెం గ్రామానికి చెందిన కూసు నాగలక్ష్మి (23) అనే యువతి మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతుంది.
ఇటీవల లాక్ డౌన్ నేపథ్యంలో అక్కడి కాలేజీ హాస్టల్ మూసివేయడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల నుండి మహారాష్ట్రకు మామిడికాయలు వేసుకువెళ్లే లారీ ఎక్కి ఎలాగోలా ఖమ్మం చేరుకుంది. ఖమ్మంలో అధికారులు పరీక్షలు చేసి, కరోనా నెగెటివ్ అని రావడంతో అక్కడి పోలీసులు ఆమెను 28 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండమని చెప్పి జిల్లాకు పంపించారు.
కాగా పెద్ద గొల్లగూడెం గ్రామంలోకి వెళదామని ప్రయత్నించిన ఆ యువతికి నిరాశే ఎదురైంది. కరోనా వైరస్ భయంతో గ్రామస్థులు ఆమెను గ్రామంలోకి రావడానికి నిరాకరించారు. ఎక్కడినుండి వచ్చావో అక్కడికే వెల్లుపోవాలంటూ చెప్పడంతో గణేష్ పాడు గ్రామంలోని వారి బంధువుల ఇంటికి వెళ్ళడానికి తిరుగు ప్రయాణమయ్యింది కానీ గణేష్ పాడు వద్ద కూడా గ్రామస్థులు గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుపడడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ యువతి అర్ధరాత్రి సైతం అక్కడి పంట పొలాల్లో తల దాచుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
ఎక్కడికి వెళ్లినా అవమానాలు, అవహేళనలు ఎదురవ్వడం, సొంత ఇంటికి వెళ్ళడానికి కూడా అనుమతినివ్వకపోవడం వంటి సంఘటనలను ఎదుర్కొన్న యువతికి జీవితంపై విరక్తి పుట్టి చావడానికి సిద్ధపడింది. ఆఖరి ప్రయత్నంగా అక్కడి గ్రామస్థులను తనను గ్రామంలోకి అనుమతించాలని, తనకు కరోనా సోకలేదని వైద్యులే తేల్చారని తెలిపినా గణేష్ పాడు గ్రామస్థులు, రెవెన్యూశాఖ అధికారులు యువతి మాటలను పట్టించుకోకుండా వెనక్కి వెళ్లిపోవాలని సూచించడంతో బహిర్భూమికి వెళుతున్నా అని చెప్పి గ్రామ పరిధిలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
బహిర్భూమికి అని చెప్పి వెళ్లిన యువతి ఎంతసేపైనా తిరిగిరాకపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్, సీఐ గన్ మెన్ మరియు సీఐ వెహికిల్ డ్రైవర్ ముగ్గురూ వెళ్లి చెరువు వద్ద చూడగా యువతి చెరువులో మునిగిపోతూ కనిపించింది. గన్ మెన్, డ్రైవర్ వెంటనే స్పందించి, చెరువులో దిగి యువతిని రక్షించారు.
అనంతరం అశ్వారావుపేట సీఐ వాహనంలోనే ఆ యువతిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. సకాలంలో స్పందించి ఒక యువతి ప్రాణాల్ని కాపాడిన సీఐ మరియు ఆయన సిబ్బందిని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే.