పీఎఫ్ ఖాతాల ద్వారా డబ్బు పొందడం కఠినతరం కానుంది. పీఎఫ్ రూల్స్‌లో మార్పులు చేశారు. ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలతో ఆధార్ నంబర్ అనుసంధానానికి గడువును సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తెలిపింది. వివిధ సంస్థల ఉద్యోగులు, పీఎఫ్‌లో తమ యాజమాన్యాల కంట్రిబ్యూషన్, ఇతర బెనిఫిట్ల వివరాలు తెలుసుకోవాలంటే వారు తమ పీఎఫ్ యూనివర్సల్ నంబర్ (యూఏఎన్)తో ఆధార్ అనుసంధానం తప్పనిసరని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది.
ఆధార్ అనుసంధానం తప్పనిసరి
ఒకవేళ ఉద్యోగులు తమ ఆధార్‌ను పీఎఫ్ యూఏఎన్ నంబర్‌తో అనుసంధానించకపోతే పీఎఫ్ ఖాతాల్లో యాజమాన్యాలు తమ కంట్రిబ్యూషన్ జమ చేయలేవు. ఈ మేరకు సామాజిక భద్రతా కోడ్ 2020లోని 142 సెక్షన్‌లో కేంద్ర కార్మిక శాఖ సవరణ చేసింది. ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీని సామాజిక భద్రతా కోడ్-2020లోని సెక్షన్ 142 గుర్తిస్తుంది. ఆ వ్యక్తి ఉద్యోగా, అసంఘటిత రంగ కార్మికుడా.. అన్న విషయం ఆధార్ అనుసంధానంతో తెలుస్తుంది. దీంతో సదరు వ్యక్తి ఈ కోడ్ ద్వారా బెనిఫిట్లు, ఇతర సర్వీసులు పొందొచ్చు.
అందరి కోసమే సామాజిక భద్రతా కోడ్
సంఘటిత, అసంఘటిత రంగాల, ఇతర రంగాల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులందరికీ సామాజిక భద్రత విస్తరించాలన్న లక్ష్యంతో 2020లో సామాజిక భద్రతా కోడ్‌ను కేంద్రం చట్టం చేసింది. ఇంకా ఈ చట్టం అమలులోకి రాలేదు. సెక్షన్ 142ను ధ్రువీకరిస్తూ కేంద్ర కార్మికశాఖ ఈ నెల 3న నోటిఫై చేసింది. ఈ 142 సెక్షన్ ప్రకారం ఈపీఎఫ్‌వోలో సబ్‌స్క్రైబర్లుగా ఉన్న ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు రిజిస్ట్రేషన్, వివిధ పథకాల బెనిఫిట్లు పొందాలంటే ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి.
అలా అయితే.. ఈపీఎఫ్ బెనిఫిట్లపై ప్రభావం
ఉద్యోగులు, కార్మికులు వారి పీఎఫ్ యూఏఎన్ నంబర్‌తో ఆధార్ అనుసంధానం చేసే బాధ్యత ఆయా సంస్థల యాజమాన్యాల బాధ్యతే. ఆధార్‌తో అనుసంధానంతో ఉద్యోగులు లేదా కార్మికులు ఈసీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సబ్‌స్క్రైబర్లు పీఎఫ్ యూఏఎన్‌తో అనుసంధానానికి ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్‌లోనే కేవైసీ అప్‌డేషన్, అడ్వాన్స్ రిక్వెస్టులు, విత్‌డ్రాయల్స్ ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఆధార్ అనుసంధానించని ఉద్యోగులు, కార్మికులు ఇతర ఈపీఎఫ్ బెనిఫిట్లను కోల్పోవాల్సి వస్తుంది.