కరోనా రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో సాధారణ భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం టైం స్లాట్ టికెట్లు ఉన్నప్పటికీ.. భక్తులు ఎప్పుడు పడితే అప్పుడు కొండెక్కేద్దామంటే వీలుపడదు. టైం స్లాట్‌లో పేర్కొన్న సమయానికి కొన్ని గంటల ముందు మాత్రమే కొండపైకి అనుమతిస్తారు.
దీనిలో భాగంగా టైం స్లాట్ టోకెన్ పొంది కాలినడకన వచ్చే భక్తులను ఉదయం 9 గంటలకు, వాహనాల్లో వచ్చే వారిని మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అనుమతించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ నూతన విధానంపై నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం వంటివి ఆకస్మికంగా జరగడంతో సోమవారం పలువురు భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
టోకెన్ ఉన్నా తమను ఎందుకు కొండపైకి పంపడం లేదని విధుల్లో ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో కొత్త నిబంధనలపై సిబ్బంది వివరించి భక్తులను శాంతింపజేశారు. దీనిపై తితిదే అధికారులు స్పందిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తరహా విధానాన్ని అమల్లోకి తెచ్చామని, ఇందుకు భక్తులు కూడా సహకరించాలని కోరారు.