నేటి నుంచి ఉజ్వల 2.0 పథకానికి శ్రీకారం

మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:52 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాల్లో ఉజ్వల యోజన పథకం ఒకటి. ఈ పథకంలో భాగంగా రెండో దశను మంగళవారం నుంచి అమలు చేయనున్నారు. ఉజ్వల యోజన 2.0 పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మంగళవారం ప్రారంభిచనున్నారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో జరిగే కార్యక్రమానికి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని పాల్గొననుండగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హాజరుకానున్నారు. అల్పాదాయ వర్గాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించడం కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
 
ఈ సందర్భంగా లబ్ధిదారులతో ప్రధాని సంభాషించి, అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉజ్వల స్కీమ్‌ను 2016లో ప్రారంభించగా.. ఆ సమయంలో ఐదు కోట్ల బీపీఎల్‌ కుటుంబాలకు చెందిన మహిళలకు లక్ష్యంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 
 
అనంతరం 2018లో పథకాన్ని మరో ఏడు వర్గాలకు వర్తింపజేస్తూ.. లక్ష్యాన్ని ఎనిమిది కోట్లకు సవరించారు. షెడ్యూల్ చేసిన తేదీకి ఏడు నెలల ముందుగానే అంటే 2019 ఆగస్టులో ఈ లక్ష్యాన్ని చేరారు.
 
2021 -22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో పీఎంయూవై పథకం కింద అదనంగా కోటి గ్యాస్‌ కనెక్షన్లను కేంద్రం ప్రకటించింది. తొలి దశలో ఎల్‌పీజీ అందుకోలేకపోయిన తక్కువ ఆదాయ కుటుంబాలకు అందించాలని నిర్ణయించింది. 
 
ఉజ్వల 2.0 కింద ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్‌తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్‌ప్లేట్ అందించనున్నారు. అలాగే ఉజ్వల స్కీమ్‌లో నమోదు కోసం కనీస ప్రతాలు అవసరం కాగా.. ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే కనెక్షన్‌ ఇవ్వనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు