రైళ్ల రాకపోకలపై గతంలో విధించిన నిషేధం ఆగస్టు 12తో పూర్తి కానున్న నేపథ్యంలో భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గకపోవడంతో.. రైల్వే సర్వీసులపై నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ, ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే లాక్ డౌన్ సమయంలో తీసుకువచ్చిన 230 ప్రత్యేక రైళ్లను మాత్రం నడపనున్నట్లు స్పష్టం చేసింది.
మరోవైపు పంటను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో రవాణా చేసేందుక వీలుగా కేంద్రం కిసాన్ రైలు సేవలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని దేవ్లాలీ నుంచి బిహార్‌లోని దాణాపూర్ వరకు బయలుదేరిన తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రారంభించారు.
ఈ క్రమంలో అబోహర్ నుంచి బెంగుళూరు, కోల్‌కతాలకు కిసాన్ రెళ్లను నడిపి కినోవా రైతులకు చేయూతనందించాలని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సోమవారం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో కినోవా పంట లక్ష ఎకరాల్లో పండిస్తున్నారని లేఖలో తెలిపారు. కిసాన్ రైళ్లతో రైతులకు ఎంతో మేలని చెప్పారు. రైతు ఉత్పత్తులను వేగంగా ఇతర ప్రాంతాలకు చేరవేసేందుకు ఇవి ఉపకరిస్తాయని చెప్పారు. రవాణాకు ఎక్కువ సమయం పట్టడం, అధిక ఉష్ణోగ్రత వల్ల మిగిలి పండంతా పాడవుతుందని దాని వల్ల రైతులు నష్టపోతున్నారని.. అందుకే ఈ రైళ్లు ఉపయోగపడతాయని తెలిపారు.