ఆర్బీఐలో రాజీనామాల పరంపర... నిన్న ఉర్జిత్ పటేల్ .. నేడు విరల్ ఆచార్య

సోమవారం, 24 జూన్ 2019 (16:47 IST)
భారత రిజర్వు బ్యాంకులో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. గత యేడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు రాజీనామా చేసిన వారి సంఖ్య రెండుకు చేరింది. గత యేడాది డిసెంబరు నెలలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. 
 
ఇపుడు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న విరల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. ఈయన పదవీకాలం మరో ఆరు నెలలు ఉంది. ఈ కాలం ముగియకముందే ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకోవడం ఇపుడు సరికొత్త చర్చకు దారితీసింది. 
 
నిజానికి విరల్ ఆచార్యను డిప్యూటీ గవర్నర్‌గా గత 2017, జనవరి 23వ తేదీన నియమించారు. మూడేళ్ళ కాలపరితి ఇచ్చారు. అయితే, సరిగ్గా మరో ఆరు నెలల్లో ఈయన పదవీకాలం ముగియనుండగా, వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఇదిలావుండగా విరల్ ఆచార్య త్వరలోనే న్యూయార్క్‌లోని స్టెర్న్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా బాధ్యతలను చేపట్టనున్నారని తెలుస్తోంది. కాగా గత యేడాది డిసెంబరులో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో ఆర్బీఐకి ఏడు నెలల వ్యవధిలో రెండో షాక్ తగిలినట్లయ్యింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు