ఆర్బీఐ కీలక నిర్ణయం... రెపో.. రివర్స్ రెపో రేట్లలో మార్పులా?

బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:36 IST)
కరోనా కష్టకాలంలో భారత రిజర్వు బ్యాంకు మరోమారు మంచి నిర్ణయం తీసుకుంది. కీలకమైన వడ్డీ రేట్లు రెపో రేటు, రివర్స్ రెపో రేటును యధాతథంగా ఉంచింది. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా… రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండగా… ఈ కీలక వడ్డీ రేట్లనే యధాతథంగా ఆర్బీఐ కొనసాగించనుంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ తొలి ద్వైమాసిక మూడు రోజుల సమావేశాలు సోమవారం నుంచి జరిగాయి. 
 
కోవిడ్ రెండో దశ దేశ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ద్రవ్యోల్బణ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఆర్బీఐ తన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 
 
కీలక వడ్డీ రేట్లు రెపో రేటు, రివర్స్ రెపో రేటును యధాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రెపో రేటు విషయంలో యధాతథ స్థితిని కొనసాగించడం వరుసగా ఇది ఐదోసారి.దేశ ఆర్థిక కార్యకలాపాలు సహజస్థితికి చేరుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
 
2021లో భారత్ 12.5 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకునే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అంచనావేయడం తెలిసిందే. చైనాకంటే ఎక్కువగా భారత్ వృద్ధిరేటును సాధించే అవకాశముందని అంచనావేసింది. కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక కష్టాలను భారత్ అత్యంత వేగంగా అధిగమిస్తున్నట్లు ఐఎంఎఫ్ అంచనావేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు