భారత రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన రూ.500, రూ.2000 నోట్లలో చిప్ పెట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిప్ పెట్టడం వల్ల నకిలీ కరెన్సీని తయారు చేయడం వీలు పడదనీ, అలాగే, భారీ మొత్తంలో ఈ కరెన్సీ నోట్లను నిల్వ చేయడం సాధ్యపడదనే వార్తలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చిప్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఆర్బీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. కొత్త నోట్లలో నానో చిప్‌లు లేదా పార్టికిల్స్ (కణాలు) పెట్టాలనుకున్న విషయం వాస్తవమేనన్నారు. అయితే, అది అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు ఆయన బెంగళూరులో తెలిపారు. అంతేకాదు, ఆ నోట్లను తనిఖీ చేయాలంటే ప్రత్యేక స్కానింగ్ పరికరాలు కావాలని... అది మరింత ఆర్థిక భారం కావడంతో పూర్తిగా వెనకడుగు వేశామని చెప్పారు.