తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి మరో ఉదాహరణ ఇది. పాత పెద్ద నోట్లు రద్దయ్యిందన్న విషయాన్ని తెలిసినా భక్తులకు ముందస్తుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో స్వామివారి హుండీలో కోట్ల రూపాయలు పడ్డాయి. హుండీ ఆదాయం పెరుగుతోందని అలాగే వదిలేశారు ఉన్నతాధికారులు. అది కాస్త ప్రస్తుతం నేలపాలు అవ్వక తప్పడం లేదు. అది కూడా 100, 200 రూపాయలు కాదు ఏకంగా 9 కోట్ల రూపాయలు. టిటిడి ఉన్నతాధికారులు మరీ ఇంత ఆలస్యంగా స్పందించడంపై మాత్రం భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
కలియుగ వైకుంఠం. ప్రతిరోజు లక్షలమంది భక్తులు వచ్చి వెళ్లే ప్రాంతమిది. భక్తుల సంఖ్య 50 నుంచి 60 వేల మంది అయితే హుండీ ఆదాయం మాత్రం 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉంటుంది. అదే శని, ఆదివారాలైతే 4 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వస్తుంటుంది. స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలను కాపాడాల్సిన బాధ్యత టిటిడి ఉన్నతాధికారులపై ఉంది.
పాత పెద్దనోట్లు రద్దయిన తర్వాత భక్తులు హుండీలో వాటిని వేయకూడదన్న విషయాన్ని కూడా టిటిడి చెప్పలేదు. దీంతో భక్తులు తమ వద్ద ఉన్న పాత నోట్లను హుండీలో సమర్పించేశారు. ఇందులో కొంతమంది భయపడి వేసిన పాత పెద్దనోట్లు కూడా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పాత పెద్దనోట్లను మార్చుకోవాలంటే ఎన్నో షరతులను కేంద్రం విధించింది. దీంతో భయపడే చాలామంది భక్తులు మ్రొక్కులుగా పాతపెద్దనోట్లనే సమర్పించుకున్నారు. టిటిడి ఉన్నతాధికారులు ముందుగానే ఈ విషయాన్ని భక్తులకు వివరించి.. పాత పెద్దనోట్లు స్వీకరించబడవని తెలిపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు భక్తులు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా 9 కోట్ల రూపాయల పాత పెద్దనోట్లు హుండీలో పడిన తరువాత ఆర్‌బిఐకి ఆలస్యంగా టిటిడి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లిఖిత పూర్వక సమాధానం కూడా ఇచ్చేశారు. పార్లమెంటులో రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి టిటిడి పాత పెద్దనోట్ల వ్యవహారాన్ని ప్రశ్నిస్తే కేంద్రమంత్రి ఈ సమాధానమే చెప్పారు. అంటే ప్రస్తుతం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని 9 కోట్ల రూపాయలు చెల్లవన్నమాట. ఇక ఆ నోట్లన్నీ చెల్లని కాగితాలే.