నిత్యావసర ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు, సిలిండర్ ధరలు ఓ వైపు పెరిగిపోతుంటే.. మరోవైపు కూరగాయల ధరలు, చికెన్, మటన్ ధరలకూ రెక్కలొచ్చాయి. తాజాగా రోజూ వంటల్లో వాడే టమోటా ధరలు పెరిగిపోయాయి.
కేవలం పది రోజుల వ్యవధిలోనే కిలో టమాటా ధర ఏకంగా 50 రూపాయల వరకు పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో టమాటా ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కనిపిస్తోంది.
ఇక, చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లో కిలో టమాటా ధర 56 రూపాయల వరకు పలుకుతోంది.
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పలు జిల్లాల్లో టమోటాల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. అయితే ఈ నెలాఖరున మళ్లీ టమోటా ధరలు తగ్గే అవకాశం వున్నట్లు వ్యాపారులు అంటున్నారు.
అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాంసం ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ.300 మార్క్‌ని చేరింది. ఏపీలోని విశాఖపట్నంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ.312కి చేరి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. దీంతో చికెన్ కొనేందుకు సామాన్యులు వెనుకాడుతున్నారు. ఈ నెల 1న రూ.228గా ఉన్న కిలో చికెన్ ధర.. కేవలం 11 రోజుల్లోనే రూ.84 మేర పెరగడం గమనార్హం.