కార్పోరేట్ ఉద్యోగాలకు అవసరమైన ఐదు అంశాలు

Munibabu

గురువారం, 31 జులై 2008 (13:06 IST)
నేడు కార్పోరేట్ రంగం విస్తరిస్తున్న క్రమం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నేటి పాస్ట్ జనరేషన్‌లో జీవితంలో త్వరగా ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నా, కెరీర్‌ వృద్ధిలో అందరికన్నా ముందున్నాలన్నా కార్పోరేట్ ఉద్యోగాలే అసలైన మార్గం అనేది చదువుకున్న ప్రతి ఒక్కరు ఒప్పుకునే అంశం.

అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికీ కార్పోరేట్ ఉద్యోగాలు లభించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కార్పోరేట్ సంస్థలు కేవలం పరీక్షలు, మార్కులు ఆధారంగా ఓ అభ్యర్థిని ఎంపిక చేసుకోవు. సంస్థ అభివృద్ధికి అవసరమైన ఎన్నో రకాల సామర్థ్యాలను అభ్యర్ధులనుంచి ఆయా సంస్థలు ఆశిస్తూ ఉంటాయి.

కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంస్థలు కోరుకునే అంశాలను ప్రాథమికంగా ఐదు రకాలుగా పేర్కొనవచ్చు. ఈ అంశాల్లో కనుక మనం పర్‌‍ఫెక్ట్‌గా ఉండగల్గితే కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగం సాధించడం అంత కష్టమేమీ కాదు. కార్పోరేట్ సంస్థలు ఉద్యోగానికి అభ్యర్ధులను ఎంపికచేసే సమయంలో క్రింది అంశాలకు ఖచ్చితంగా ప్రాముఖ్యానిస్తాయి. అవి ఏంటంటే...

అభ్యర్థి సాంకేతిక పరిజ్ఞానం
ఈ విషయాన్ని ప్రతి కార్పోరేట్ సంస్థ ప్రముఖంగా పరిశీలిస్తుంది. అభ్యర్థి చదివింది సాధారణ డిగ్రీ అయినా ఫర్వాలేదు. అయితే వారికి సాంకేతిక పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలని కార్పోరేట్ సంస్థలు కోరుకుంటాయి. ఎందుకంటే కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగం అంటే కంప్యూటర్‌పై పని చేయాల్సి ఉంటుంది. అందుకే కంప్యూటర్‌కు సంబంధించిన అన్ని రకాల ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే మంచిది.

కమ్యునికేషన్ స్కిల్స్
ఇతరులతో మీరు సరైన కమ్యునికేషన్ ఏర్పరచుకోవాలంటే మీకు కమ్యునికేషన్ స్కిల్ తప్పకుండా అవసరం. ఈ విషయంలో కార్పోరేట్ సంస్థలు విపరీతమైన ప్రాముఖ్యానిస్తాయి. మీ సర్టిఫికేట్‌లో మార్కులు మోస్తరుగా ఉన్నా ఫర్వాలేదు. అందర్నీ ఆకట్టుకునేలాంటి మంచి ఆంగ్ల భాషా ప్రావీణ్యం, చక్కని ఉచ్ఛారణ ఉంటే కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగిగా మీ కల నెరవేరినట్టే.


భావ వ్యక్తీకరణ (ప్రెజెంటేషన్)
మీలోని సమాచారాన్ని ఇతరులతో చక్కగా పంచుకోగలరా అనే విషయాన్ని కార్పోరేట్ సంస్థలు అంచనా వేస్తాయి. అందుకే కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగం అంటే కనీసం ముగ్గురు కన్నా ఎక్కువమంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది.

ఇంటర్య్వూ సమయంలో వారు అడిగే ప్రశ్నలకు మీరు ఎలా స్పందిస్తున్నారు. వాటికి ఎలా సమాధానాలు చెబుతున్నారు. మీలో భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఏ స్థాయిలో ఉంది అనే అంశాల్ని ఉన్నతాధికారులు అంచనా వేస్తారు. అందుకే కార్పోరేట్ ఉద్యోగం అంటే వ్యక్తీకరణ సామర్థ్యం తప్పనిసరి.

టీమ్ స్పిరిట్ (టీమ్‌లో పనిచేయగల్గడం)
అందరిలో కలిసిపోయి, అందరితోనూ చక్కగా ప్రవర్తిస్తూ పనిచేయగల అలాగే ఇతరులతో పనిచేయించుకోగల సామర్ధ్యాన్నే టీమ్ స్పిరిట్ అని చెప్పవచ్చు. ఈ అంశానికి కార్పోరేట్ సంస్థలు అత్యంత ప్రాముఖ్యానిస్తాయి. సంస్థలోని అందరితో కల్సిపోయి పనిచేసేవారుంటే వారివల్ల పనులు త్వరగా అవుతాయి. అలాకాక ఒంటరిగా, ఏకాకిగా ఉండేవారి వల్ల సంస్థలో టీమ్ స్పిరిట్ దెబ్బ తింటుంది. కాబట్టి కార్పోరేట్ సంస్థలు టీమ్ స్పిరిట్ ఉండే అభ్యర్ధులకు ప్రాముఖ్యానిస్తాయి.

అభ్యర్థి ఆసక్తి, సమర్థత
కార్పోరేట్ సంస్థలు అభ్యర్థిలో ఆసక్తి, సామర్థ్యం ఏమేరకు ఉన్నాయనే అంశాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తాయి. ఎందుకంటే ఎన్ని తెలివితేటలున్నా చేసేపనిపై ఆసక్తిలేని వారివల్ల సంస్థకు నష్టమే తప్ప లాభం లేదు. అందుకే చేరే ఉద్యోగానికి సంబంధించి అభ్యర్థిలోని ఆసక్తిని సంస్థలు అంచనా వేస్తాయి.

తద్వారా సంస్థకు మంచి ఆసక్తిగల అభ్యర్ధిని ఎంచుకోవడానికి కార్పోరేట్ సంస్థలు కృషి చేస్తాయి. పైన పేర్కొన్న ఐదు అంశాల్లో మీరు సిద్ధంగా ఉంటే సాధారణ స్థాయి చదువుతోనే కార్పోరేట్ ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతాన్ని సొంతం చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి