భ్రష్టుపట్టిన బీఎడ్‌కి కేంద్రం షాక్ ట్రీట్‌మెంట్: నేషనల్ ఎంట్రెన్స్ తప్పదు
శుక్రవారం, 27 జనవరి 2017 (04:58 IST)
దేశంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు 10 లక్షలు. బీఈడీ కోర్సు పూర్తి చేసిన వారు 20 లక్షల మంది. ప్రతి మూడు నాలుగేళ్ల కోసారి ప్రభుత్వాలు నియమిస్తున్న టీచర్ల సంఖ్య కొన్ని వేలు. ఉద్యోగాలు తక్కువగా ఉన్నా వెల్లువలా ఉపాధ్యాయ అభ్యర్థులు బీఈడీ కాలేజీల్లోంచే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. సర్టిఫికెట్లు తప్ప వీరిలోకనీస ప్రమాణాలు లేవని అర్థమవుతూనే ఉన్నా పరిష్కారం వెదకని రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కొరడా ఝళిపించింది.
ఉపాధ్యాయ విద్యా కాలేజీలు కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా మారిపోయాయన్న విమర్శల నేపథ్యంలో ఉపాధ్యాయ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులకు అందే శిక్షణలోనే సరైన ప్రమాణాలు లేని కారణంగా ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదని కేంద్రం గుర్తిం చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే కోర్సు పూర్తయ్యాక జాతీయ స్థాయిలోనే 'ఎగ్జిట్' పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది.
ఉపాధ్యాయ విద్యకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ప్రవేశాల విధానం, ప్రవేశ పరీక్షల తీరు, కోర్సుల నిర్వహణ ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయ విద్యా కాలేజీలు కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా మారిపోయాయన్న విమర్శలూ ఉన్నాయి. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది. అందువల్లే 150కి పైగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కాలేజీల్లో 2016–17 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
అటు బీఎడ్ ప్రవేశాల రెండో దశ కౌన్సెలింగ్‌కూ అనుమతివ్వలేదు. కొన్ని రాష్ట్రాల్లో బీఎడ్ తరగతుల నిర్వహణ కూడా లేకుండానే కాలేజీలు, సర్టిఫికెట్ల జారీ వ్యవహారాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటి నేపథ్యంలోనే ఉపాధ్యాయ విద్యను దేశవ్యాప్తంగా ఒకే విధానంలో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా 2014లో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యా కోర్సులు, కాల వ్యవధి, టీచింగ్ ప్రాక్టీస్ వంటి అంశాల్లో ఏక రూప విధానాన్ని తీసుకువచ్చింది. తాజాగా జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించి, ఆ ర్యాంకుల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలని యోచిస్తోంది.
బీఎడ్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి కాలేజీల్లో నిర్వహించే వార్షిక పరీక్షలే కాకుండా జాతీయ స్థాయిలో ఎగ్జిట్ పరీక్ష కూడా నిర్వహించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులో అర్హత సాధించిన వారే బీఎడ్ కోర్సును పూర్తి చేసినట్లుగా, ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్లు ఇచ్చేలా నిబంధనల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. దీనిద్వారా కేవలం సర్టిఫికెట్ కోసం బీఎడ్ కోర్సు చదవకుండా ఉండేలా.. ఉపాధ్యాయ వృత్తి పట్ల శ్రద్ధ, ఆసక్తి కలిగిన వారే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించేలా చర్యలు చేపట్టినట్లవుతుందని భావిస్తోంది.
దీనివల్ల విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు మెరుగవుతాయని భావిస్తోంది. దీనికితోడు బీఎడ్ పూర్తి చేసిన వారికి కనీసం ఆరు నెలల పాటు ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో ‘ఇండక్షన్ ట్రైనింగ్ (ప్రేరణ కలిగించే శిక్షణ)’ఉండేలా చర్యలు చేపడుతోంది. ఎన్‌సీటీఈ వాటిని ఈ ఏడాదిలోనే సిద్ధం చేస్తే.. 2018–19 విద్యా సంవత్సరం నుంచే బీఎడ్ ప్రవేశాల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.