కొత్త ఉద్యోగం కోసం 84% మంది అమెరికన్ ఉద్యోగుల పరుగు
అమెరికాలో మెజారిటీ సంఖ్యలో ఉద్యోగులు కొత్త ఉద్యోగాలవైపు మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో నానాటికీ పెరిగిపోతున్న ఒత్తిడి, అవిశ్రాంతత వంటి పలు కారణాల వల్ల వచ్చే ఏడాదిలో అమెరిగా ఉద్యోగులు ఉన్న ఉద్యోగాలను వదలి కొత్త ఉద్యోగాలపై మక్కువ చూపుతున్నట్లు ఆ సర్వే వెల్లడించింది.
దాదాపు 84 శాతం మంది ఉద్యోగులు 2011లో కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికాకు చెందిన మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ సంస్థ "రైట్ మేనేజ్మెంట్" చేసిన సర్వేలో వెల్లడైంది. గతేడాది చేపట్టిన ఇదే సర్వేలో వీరి సంఖ్య కేవలం 60 శాతంగా మాత్రమే ఉండగా అది ప్రస్తుత సంవత్సరంలో 84 శాతానికి పెరిగింది.
కాగా.. ఐదు శాతం మంది ఉద్యోగులు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగుతామని చెప్పగా, 11 శాతం మంది వారి నిర్ణయం ఖచ్చితం కాదని చెప్పారు. ఉత్తర అమెరికాలో 1,400 మంది ఉద్యోగులపై ఈ సర్వేను నిర్వహించారు. అవిశ్రాంత వల్లే తాము ఉద్యోగం మారాలనుకుంటున్నామని, జాబ్ మార్కెట్ ఊపందుకుంటే తప్పకుండా ఉద్యోగం మారుతామని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు.