అమెరికాలో అరబిక్‌ నిపుణులకు భలే గిరాకీ

అరబిక్‌ నేర్చుకుంటున్నావా? ఏం చేద్దామని? ఒకప్పుడు అమెరికా విశ్వవిద్యాలయాల్లోని అరబిక్‌ శాఖ విద్యార్థులకు ఇలాంటి ప్రశ్న కనీసం వారానికోమారు వెటకారంగా వినబడుతుండేది. పాపం ఆ విద్యార్థులు కూడా ఏం చెప్పలేక తలొంచుకొని తమ దారిన తాము వెళ్లి పోయేవారు. అయితే సెప్టెంబర్‌ 11 (9/11)న న్యూయార్క్‌ వరల్డ్‌ ట్రేడ్‌ టవర్లపై జరిగిన దాడుల అనంతరం అలాంటి ప్రశ్నలు ఎవరూ వేయడం లేదు సరికదా అమెరికాలో అరబిక్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి.

ఉగ్రవాదంపై జరుపుతున్న పోరులో భాగంగా తీవ్రవాదుల కుట్రలు, కుతంత్రాల నుంచి అమెరికాను కాపాడుకొనే దిశగా ఆ దేశ నిఘా విభాగం ఇప్పుడు అరబిక్‌ నిపుణుల కోసం వేటాడుతోంది. అదేవిధంగా అరబిక్‌ సంబంధిత ఉర్దూ తదితర భాషావేత్తలకూ అమెరికాలో అవకాశాలు మెరుగయ్యాయి. ఉగ్రవాదులు ప్రధానంగా ఇరాక్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మరియు పాకిస్థాన్‌ వంటి ఇస్లాం దేశాలకు చెందిన వారు కావడంతో ఆ భాషలకు చెందిన వారితో అమెరికాకు ఇప్పుడు పుష్కలంగా పనిపడింది.

అరబిక్ ఉద్యోగ అభ్యర్థుల విధులేమిటి?
ఉగ్రవాదులకు సంబంధించి లభ్యమయ్యే ఉత్తర ప్రత్యుతరాలు, సమాచారాన్ని ఆంగ్లంలోకి అనువదించాల్సి ఉంటుంది. పట్టుబడిన ఉగ్రవాదుల విచారణలో దుబాసీలుగా లేదా సామర్ధ్యాన్ని బట్టి విచారణాధికారులుగా ఉద్యోగాలుంటాయి. ఇంకా నిఘా విభాగానికి చిక్కిన ఉగ్రవాదుల సంభాషణలను అర్థం చేసుకొని నిఘా విభాగానికి సహకరించడంతో పాటు అవసరమైతే అమెరికా నిఘా విభాగం నిర్వహించే ఆపరేషన్లలో వారి తరపున గూఢచారులుగా పనిచేయడం వంటి కీలక అవకాశాలు కూడా దక్కుతాయి. మంచి జీతాలను అందిస్తున్న ఈ ఉద్యోగాలు అరబిక్‌ విద్యార్థుల పాలిటవరంగా మారాయి.

అరబిక్‌ భాషకు చెందిన రకరకాల యాసలు మాట్లాడే సామర్థ్యం పెంపొందించుకుంటే అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయి. ఒకప్పుడు గల్ఫ్‌ దేశాల్లో విలాస, వినోద పర్యటనలు చేసేందుకు, వ్యాపార అవసరాల రీత్యా, సాహిత్య అధ్యయనం కోసం అరబిక్‌ను నేర్చుకునేవారని అమెరికాలోని అరబిక్‌ అధ్యాపకుల సంఘం తెలిపింది. అయితే 9/11 దాడుల అనంతరం విశ్వవిద్యాలయాల్లో అరబిక్‌ నేర్చుకొనేవారి సంఖ్య 90 శాతం దాటినట్లు తెలిసింది.

వీరందరికీ అమెరికా పోలీసు, నిఘా, న్యాయ, రక్షణ విభాగాల్లోను సైనిక దళాల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాక్‌, ఇరాన్‌, ఆప్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, లెబనాన్‌, సిరియా తదితర దేశాల్లోని అమెరికా కార్యకలాపాల నిర్వహణకు అరబిక్‌ నిపుణుల సేవలు అవసరమవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి