దోషి పేరిట పథకాలా అనడం కూడా స్టాలిన్ తప్పేనా? జయ బొమ్మ వివాదంపై మండిపడుతున్న ఏఐఏడిఎంకె

ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (05:33 IST)
ప్రభుత్వ కార్యాలయాల్లో, స్థానిక సంస్థల్లో, మంత్రుల ఛాంబర్‌లలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫొటోను తొలగించాల్సిందేనని, పథకాల్లో సైతం మార్పులు తప్పనిసరి అని  డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్‌ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు అన్భళగన్, శేఖర్‌బాబులతో కలిసి శనివారం ఉదయం సచివాలయంకు వచ్చిన స్టాలిన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌తో భేటీ అయ్యారు ఆమెకు ఈ విషయమై ఓ వినతి పత్రాన్ని సమర్పించారు.  అనంతరం మీడియాతో స్టాలిన్  మాట్లాడుతూ, జయలలితను కోర్టు దోషిగా తేల్చిందని, అయితే, ఇంకా ఆమె ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచడం చట్ట విరుద్దం అని అన్నారు. సీఎం నేతృత్వంలో ఆమె జయంతిని అధికారిక వేడుకగా నిర్వహించడం శోచనీయమని విమర్శించారు.
 
కోర్టు తీర్పుతో దోషిగా ముద్రపడ్డ దివంగత సీఎం జయలలిత ఫొటోల వ్యవహారం వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, స్థానిక సంస్థల్లో ఆమె ఫొటోలు ఉండడం, పథకాలకు ఆమె పేరు కొనసాగుతుండడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. వాటిని తొలగించాల్సిందేనని పట్టుబడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ కు వినతి పత్రం సమర్పించారు.
 
రాష్ట్రంలో అమ్మ జయలలిత పేరిట పథకాలు కోకొల్లలు. అమ్మ పథకాలకు ప్రజల్లో విశేష స్పందనే ఉంది. అయితే, ప్రస్తుతం ఆ పథకాలకు పేర్ల మార్పు తప్పనిసరి కానుంది. ఇందుకు కారణం అక్రమాస్తుల కేసులో జయలలిత కూడా ఓ దోషి కావడమే. ఆమె భౌతికంగా లేకున్నా, కోర్టు తీర్పు  లో జయలలితను కూడా దోషిగా పేర్కొన్నారు. దీంతో దోషిగా ముద్రపడ్డ వారి పేర్లు పథకాలకు ఉపయోగించేందుకు వీలు లేదు. అలాగే, వారి ఫొటోలు కార్యాలయాల్లో ఉండ కూడదు. 
 
అయితే, ఇక్కడ అన్నాడీఎంకే సర్కారు అధికారంలో ఉండడంతో తాము పెట్టిందే చట్టం అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. అమ్మ పథకాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని పథకాలకు అమ్మ పేర్లు పెట్టేందుకు కసరతు్తలు జరుగుతున్నాయి. ఇక, అమ్మ జయంతిని అధికారిక వేడుకగా కూడా నిర్వహించారు. వీటన్నింటినీ తీవ్రంగా పరిగణించిన ప్రధాన ప్రతి పక్షం డీఎంకే ఇక, అమ్మ బొమ్మలకు, పథకాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధవైుంది. 
 
అమ్మ పేరిట ఉన్న పథకాలను కొనసాగిస్తాం, కొత్త పథకాలకు పేర్లు పెడుతామని పాలకులు వ్యాఖ్యానిస్తుండడం బట్టి చూస్తే, చట్టాలను ఏ మేరకు తుంగలో తొక్కుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం సమర్పించామని, స్పందించని పక్షంలో కోర్టులో తేల్చుకుంటామన్నారు. దోషిగా ముద్ర పడ్డ వారి ఫొటోలను ఇంకా తొలగించకుండా ఉండడం చట్ట విరుద్ధం అని తమిళనాడు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇలంగోవన్  మండిపడ్డారు. కోర్టు తీరు్పను ధిక్కరించే విధంగా వ్యవహరిస్తున్న తమిళనాడు ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
 
మరోవైపున అన్నాడీఎంకే శశికళ వర్గం కూడా స్టాలిన్ వాదనను ధీటుగా ఎదుర్కొంది. పనిగట్టుకుని తమ ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే చేస్తున్న కుట్రల్లో భాగంగానే, ప్రస్తుతం అమ్మ ఫొటోల వివాదాన్ని సృష్టిస్తున్నారని, అన్నాడీఎంకే ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్, మంత్రులు తంగమణి, దిండుగల్‌ శ్రీనివాసన్  ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మొత్తం మీద చూస్తుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో, పథకాల్లో జయ ఫోటో ఉంచడం, తీసివేయడంపై కూడా తమిళనాడులో కోర్టు తీర్పు తప్పదనిపిస్తోంది
 
 

వెబ్దునియా పై చదవండి