తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థంగా మారిందని, ఆ విద్యార్థులను ఆదుకోవాలని రాష్ట్ర విద్యామంత్రి కె.సెంగోట్టయ్యన్‌కు ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు కోరారు. ఇదేవిషయంపై ఆయన సోమవారం మంత్రి సెంగోట్టయ్యన్‌ను కలిసి ఓ వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు.
2006లో డీఎంకే తీసుకొచ్చిన నిర్బంధ తమిళ విద్యా విధానం వల్ల పదో తరగతి చదివే మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ముఖ్యంగా చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లోని పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివే విద్యార్థులు, పదో తరగతి పబ్లిక్ పరీక్షలను వారివారి మాతృభాషల్లోనే రాసేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇదే విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాటి గవర్నర్ రోశయ్యలు కూడా ముఖ్యమంత్రి దివంగత జయలలితకు కూడా లేఖలు రాసి మైనార్టీ విద్యార్థులు వారివారి మాతృభాషల్లో పరీక్షలు రాసేలా అనుమతించాలని కోరినట్టు కృష్ణారావు పేర్కొన్నారు. అందువల్ల ఈ యేడాది కూడా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా తమతమ మాతృభాషలో పరీక్షలు రాసుకునేలా ఆదేశించాలని కోరారు.
అంతేకాకుండా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ, ఎంబీసీ, మైనార్టీ ప్రజల సంక్షేమార్థ జారీ చేసిన జీవో నంబరు 83ను అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టుగా తమిళనాడులో కూడా త్రిభాషా (మాతృభాష, ఇంగ్లీష్, తమిళం) విధానాన్ని అమలు చేయాలని కోరారు. 2017 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను తెలుగు విద్యార్థులు తెలుగు భాషలో రాసుకునేలా సహకరించాలని కోరారు.