ప్లీజ్.. మమ్మీ (జయ)ని చూపించండి... అపోలో వైద్యులకు డీఎంకే చీఫ్ కరుణానిధి వినతి

శనివారం, 1 అక్టోబరు 2016 (13:39 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్షీణించిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న జయలలిత గత నెల 22వ తేదీన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే రెండు రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదు.

దీంతో సామాజిక మాధ్యమాల్లో సీఎం ఆరోగ్య పరిస్థితిపై వదంతులు మొదలయ్యాయి. ఆసుపత్రి తరపు నుండి గానీ పార్టీ తరపు నుండి గానీ ఎటువంటి ప్రకటనా విడుదల కాకపోవటంపై ఆమె ఆరోగ్యపరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆసుపత్రి వద్ద ఆమె అభిమానులు భారీగా చేరుకున్నారు. 
 
జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని పలు ఆలయాలలో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మరో పక్క వదంతులని నమ్మవద్దని ఏఐఏడీఎంకే నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వదంతుల నేపథ్యంలో జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జయలలిత ఆరోగ్యంపై రకరకాల వదంతులు వస్తున్న నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో విడుదల చేయాలని కరుణానిధి డిమాండ్‌ చేశారు. 
 
ఇంకోవైపు వదంతులు సృష్టించిన పలువురిపై అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కాగా జయలలిత ఆరోగ్య పరిస్థితిని వెంటనే వెల్లడించాలని, లేదంటే వదంతులకు మరింత ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందని పలువురు కోరుతున్నారు. ఇదిలావుంటే మధ్యాహ్నం జయలలితను చూసేందుకు రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్రం నుంచి చెన్నైకు వస్తున్నారు. ఆయన నేరుగా అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలితను కలుస్తారు.

వెబ్దునియా పై చదవండి