పన్నీర్ సెల్వం కొన్ని నిజాలు చెప్పారు. చెప్పని నిజాల మాటేమిటి?
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (02:20 IST)
తమిళనాడు తాజా రాజకీయాల్లో దాగిన నిజాలు బయట పడుతున్నాయి. అన్నాడిఎంకే కార్యకర్తలు, అభిమానుల అభిమతం మేరకే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన పదవిని త్యాగం చేశారని, ఒక్కమాటలో చెప్పాలంటే సెల్వ త్యాగానికి మారుపేరైన త్యాగయ్య అని గప్పాలు కొట్టి మరీ నాటకాలాడిన శశికళ పోయెస్ గార్డెన్‌లో చేస్తున్న డ్రామాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. మంగళవారం సాయంత్రం మెరీనా తీరంలోని జయలలిత సమాధివద్ద గంటసేపు మౌనంగా కూర్చున్న మాజీ సీఎం పన్నీర్ సెల్వం తమిళ ప్రజల గుండె పగిలే ప్రకటన చేశారు.
తనను సీఎం పదవి నుంచి బలవంతం రాజీనామా చేయించారని చెప్పిన సెల్వం తమిళనాడు రాజకీయాల్లో పెనుబాంబు పేల్చారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి తనను ఆహ్వానించలేదని, నిరంతరం తనను అవమానించారని, కించ పరిచారని పన్నీర్ సెల్వం సంచలన నిజాలు వెల్లడించారు. తాను మంచి పనులు చేస్తే కొందరికి నచ్చదని, ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.
పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు జయ స్ఫూర్తితో కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. నిజాలు చెప్పాలని అమ్మ ఆత్మ నన్ను ఆదేశించింది అంటూ పన్నీర్ సెల్వం ఆస్పత్రిలో అనారోగ్యంగా ఉన్న జయలలిత తననే పార్టీ బాధ్యతలు స్వీకరించాలని కోరినట్లు సంచలన ప్రకటన చేశారు. పార్టీ కీలక బాధ్యతలు స్వీకరించడానికి తాను అంగీకరించనప్పుడు తమిళనాడు ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా అంగీకరిస్తారని జయలలిత తనకు ధైర్యం చెప్పారని, కాని జయలలిత లేని పక్షంలో మాత్రమే సీఎం పదవిని స్వీకరించాను. పార్టీని అగౌరవ పరచలేకే బాధ్యతలు చేపట్టానని సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు. నా అంతరాత్మ క్షభిస్తోంది.. అందుకే నిజాలు చెప్తున్నా అంటూ నోరు విప్పిన సెల్వం స్పీకర్ మధుసూదన్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి చేయాలని అమ్మ నన్ను కోరారు. నేను అందుకు ఒప్పుకోలేదు' అని కూడా చెప్పారు.
తనను సీఎం పదవికి రాజీనామా చేయాలని చెప్పి బలవంతంగా తనను గద్దెనుంచి దింపిన క్షణం నుంచి పన్నీర్ సెల్వం రాజకీయ నిర్వేదంలోకి వెళ్లిపోయారు. పోయెస్ గార్డెన్‌లో తాను రాజీనామా చేసిన రోజే పార్టీలో కీలక పదవిని ఇస్తానని శశికళ ప్రతిపాదిస్తే మీరూ వద్దూ.. మీ పదవులు వద్దంటూ సెల్వం సున్నితంగా తిరస్కరించినట్టు కూడా వార్తలొచ్చాయి పైగా, శశికళ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో ఎలాంటి పదవిలోనూ కొనసాగకుండా సాధారణ కార్యకర్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలిసింది. శశికళ ఏ పదవి ఇచ్చినా తీసుకునే ప్రసక్తేలేదని కరాఖండిగా తేల్చి చెప్పారని కూడా సమాచారం.
ఇప్పుడు కొద్ది రోజుల మౌనం తర్వాత పన్నీర్ సెల్వం కొన్ని బరువైన నిజాలు చెప్పడం వాస్తవమే కానీ చెప్పాల్సిన అసలు నిజాలు చాలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. దాదాపు 75 రోజులపాటు చెన్నయ్ అపోలో ఆసుపత్రిలో గవర్నర్‌కి, కేంద్రమంత్రులకు కూడా చూపించకుండా జయలలితకు అంత రహస్య వైద్యం చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆస్పత్రిలో చేరకముందు పోయెస్‌గార్డెన్‌లో పడిపోయిన జయలలితకు సుగర్ పాయింట్ 700కు చేరుకోవడానికి కారణమెవరు, ఇంటివద్ద జయలలిత వైద్య చికిత్సలు చేయించుకునే వారా? ఆమె శరీరంలో చక్కెర నిల్వలు అంత ప్రమాదకర స్థితికి చేరుకున్నా ఎందుకు గమనించలేకపోయారు, ఆసుపత్రిలో ఉండగా ఆమె చేసినట్లు విడుదల చేసిన ఆడియో టేప్‌లో స్వరం ఆమెదేనా? తమిళనాడులో జయలలితకు వైద్యం చేసే స్థాయి ఆసుపత్రులే లేవా వంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా పన్నీరు సెల్వం మీదే ఉంది.