అమ్మ దూరం పెట్టిన కుటుంబాన్ని సమర్థిస్తారా: శశికళ వర్గం ఎమ్మెల్యేలకు పన్నీర్ సవాల్

శనివారం, 18 ఫిబ్రవరి 2017 (02:01 IST)
అమ్మ జయలలిత జీవితం చివరివరకు పార్టీకి దూరం పెట్టిన శశికళను, ఆమె బంధువులను మళ్లీ పదవుల్లోకి తెస్తారా ఇది అమ్మ అనుకూల రాజీనామేనా అంటూ తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే శశికళ వర్గం ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. పన్నీర్‌ సెల్వం ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళపై విమర్శలను తీవ్రతరం చేశారు. శశికళపై పన్నీర్‌ తీవ్రస్థాయిలో బాణాలను ఎక్కుపెట్టారు. శశి కుటుంబాన్ని తమిళ రాజకీయాలకు జయలలిత ఆద్యంతం దూరంగా ఉంచారని చెప్పారు. అమ్మ చివరి నిమిషం వరకు కూడా ఆమెను పార్టీకి దూరం పెట్టారన్న విషయాన్ని ఆయన శుక్రవారం మరోసారి గుర్తుకు చేశారు. శశికళ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలనే లక్ష్యంతోనే అమ్మ పనిచేశారన్నారు. సభలో బల పరీక్షకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఘాటు వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
 
జయలలిత ఆశయాలను కాపాడేందుకు అసెంబ్లీలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. బల పరీక్షలో ఆలోచించి ఓటు వేయాలని, ఒత్తిడికి గురై పళని వర్గాన్ని బలపర్చవద్దని కోరారు. ప్రస్తుతం పన్నీర్ వర్గంలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పళనిస్వామి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ డీఎంకే కూడా వ్యూహాత్మాకంగా ముందుకు వెళ్తోంది. శుక్రవారం ఉదయం బల పరీక్షకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అనూహ్యంగా శుక్రవారం సాయంత్రం డీఎంకే నేతల భేటీ అనంతరం సభకు హాజరుకావాలని నిర్ణయించారు.
 

వెబ్దునియా పై చదవండి