* చిన్నవయసులో పద్యాలు, ఏబీసీడీలు, టేబుల్స్, ఫార్మూలాలను బట్టీ పట్టడం అనేది సాధారణ విషయమే. ఆ వయసులో అలా చదివినవి మెదళ్లలో బాగా చేరిపోతాయి, వాటిని మర్చిపోలేరు కూడా. అయితే ఇది కేవలం ఒకటినుంచి మూడు తరగతుల వరకు మాత్రమే ఉండాలి. అంతేగానీ ఆ తర్వాత కూడా పాటిస్తూపోతే.. ఎనర్జీ, టైమ్ రెండూ వృధా అవుతాయి.
* బట్టీ కొట్టడంవల్ల జ్ఞానం పెరగదు. పైగా పరీక్షలు రాసేటప్పుడు ఏదైనా విషయం గుర్తురాకపోతే ఇక అంతే సంగతులు. బట్టీ కొట్టి చదవటంవల్ల ఏ ప్రశ్నకైనా సమాదానాన్ని యధాతథంగా రాయటమేగానీ, తమదైన శైలిలో సొంత వాక్యాలతో రాయలేరు. సొంతంగా అర్థం చేసుకోనూలేరు. సొంతంగా రాయటం అలవాటుకానివారిలో తెలివితేటలు పెరగవు. విషయాలపై అవగాహన రాదు.
* నాలుగో తరగతి నుంచి పిల్లలు బట్టీ పట్టేందుకు ప్రయత్నించకపోవటం ఉత్తమం. పుస్తకంలో ఇచ్చిన విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పాఠంలోని విషయం అర్థమైతే పరీక్షల్లో ప్రశ్న ఎలా అడిగినా, సమాధానం విపులీకరించి రాసే అవకాశం లభిస్తుంది.
* 20-30 నిమిషాలపాటు చదివిన అంశాలను 2 లేదా 3 లైన్లలో క్లుప్తంగా మెదడులో గుర్తుంచుకోవాలి. అలాగే రాసుకోవాలి కూడా. చదివినదానితో కంపేర్ చేసుకుంటూ, విశ్లేషించుకుంటూ, పోల్చుకుంటూ చదివితే సులభంగా గుర్తుండిపోవటమేగాక, మర్చిపోయే అవకాశమే ఉండదు.
* తెల్లవారుజామున 4, 5 గంటల సమయంలో లేచి చదివితేనే విషయాలు గుర్తుండిపోతాయనుకోవటం సరైనది కాదు. ఆరు లేదా ఏడుగంటలపాటు నిద్రపోయిన పిల్లలకు మాత్రమే తెల్లవారుజామున చదివినవి బాగా గుర్తుండిపోతాయి. ఆ సమయంలో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, టేబుల్స్ లాంటివి మిగిలిన సమయంలో చదివినప్పటికంటే సులభంగా మెదడులో చేరిపోతాయి.