నిద్రతో పిల్లల ఊబకాయాన్ని దూరం చేయండి..!!

బుధవారం, 11 ఏప్రియల్ 2012 (13:27 IST)
FILE
అల్లరి చేసే పిల్లలకు ఆటలు, పాటలు, సరదా కార్యక్రమాలుంటే చాలు ఎన్ని గంటలయినా కాలక్షేపం చేస్తారు. అదే నిద్రపో అంటే మాత్రం అప్పుడేనా అంటూ మారాం చేస్తారు. వేళకు నిద్రపోని చిన్నారుల్లో ఊబకాయం సమస్య తప్పదు అంటున్నారు వైద్య నిపుణులు.

తొమ్మిది నుంచి పదహారేళ్లలోపు వయసున్న రెండు వేల మంది పిల్లల్ని పరిగణంలోకి తీసుకొని లండన్‌కు చెందిన అధ్యయనకర్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలిన సత్యమిది. వేళపట్టున పడుకుని వేకువనే నిద్రలేచే వారితో పోలిస్తే, ఆలస్యంగా నిద్రించే చిన్నారుల్లో ఒకటిన్నర రెట్లు అధికంగా ఊబకాయం సమస్య ఉంటుందని తేలింది.

అలానే టీవీలు, కంప్యూటర్ల ముందు పొద్దుపోయేదాకా గడిపేవారు దాదాపు మూడు రెట్లు అధికంగా స్థూలకాయులుగా మారుతున్నారని ఆ అధ్యయనంలో తేలింది. ఈ సమస్యను నివారించాలంటే, చిన్నారులు కంటినిండా నిద్రపోయేలా తల్లులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

పిల్లలు ఎంత ఎక్కువ నిద్రపోతె అంత ఎక్కువ చురుగ్గా ఉంటారు. ఇది సాధ్యం కావాలంటే, వేళకు హోంవర్క్‌లు చేయించడం కాసేపు ఆటలాడించడం, భోజనం పెట్టడం లాంటి దినచర్య ప్రణాళిక ప్రకారం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి