పరలోకానికి తోవ చూపే పది ఆజ్ఞలేంటో తెలుసా..!?

శనివారం, 8 అక్టోబరు 2011 (15:56 IST)
FILE
"మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు" యోహాను 14:15 దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు. పరలోక పురములో మనకు నివాసము ఏర్పరుస్తానని మాటిచ్చాడు. అందుకోసం మనం చేయవలసిన కార్యములను పది ఆజ్ఞలలో పొందుపరిచాడు.

పది ఆజ్ఞలలోని అంతరార్థాన్ని పరిశీలిస్తే మన జీవితంలో అడుగడుగునా ఆ ఆజ్ఞలను పాటించవలసిన అవసరం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. నేను తప్ప నీకు వేరే దేవుడుండకూడదు. అంటే లోకంలో మనకు ఎన్ని బంధాలున్నా ఆయనతో మనకున్న బంధమే దృఢమైనది, శాశ్వతమైనది. ఆకాశమందేగానీ, భూమియందేగానీ దేని రూపాన్నీ పూజించకూడదు. అంటే దేవుడు మాత్రమే వాస్తవం.

ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఆ దేవుని సృష్టే. శాశ్వతుడైన ఆయన్ని మరచి, అశాశ్వతమైన సృష్టిని పూజించకూడదు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్ఛరించకూడదు అనే ఆజ్ఞ మనం మాట్లాడాల్సి విధానాన్ని నేర్పుతుంది. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. మనం చేసే పాపకార్యాలకు దేవుడిని అడ్డు పెట్టుకోకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి.

అంటే వారానికి ఒక్కరోజైనా మనల్ని సృష్టించిన ఆ తండ్రికోసం మనం కేటాయించాలి. వారమంతా పాపాల్ని లెక్కించుకుని ఆ తండ్రిని క్షమాపణ కోరాలి. తల్లిదండ్రుల్ని సన్మానించుము. దీనర్థం మనం తల్లిదండ్రుల్ని గౌరవించటమంటే దేవుని మహిమపరచటమేనని. నరహత్య చేయవద్దు. అంటే ఆవేశకావేశాలకు లోనుకాకుండా మన భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. నరహత్య చేయువాడు నరకాగ్నిలో పడతాడని దేవుడు స్పష్టంగా తెలిపాడు కూడా.

వ్యభిచరించ కూడదు అనే ఆజ్ఞ వివాహబంధాన్ని మనం ఎలా గౌరవించాలి అనే విషయాన్ని తెల్పుతుంది. శారీరకంగాను, మానసికంగాను జీవితభాగస్వామికి కట్టుబడి ఉండాలని సూచిస్తోంది. దొంగిలించకూడదు. అంటే కష్టపడి పని చేసి మనకు కావలసినదాన్ని సంపాదించుకోవాలే కానీ మరొ కడి కష్టార్జితాన్ని దోచుకోకూడదు.

పొరుగువానిపై అబద్ధపు సాక్ష్యం పలుకకూడదు. అంటే స్వార్థంతో అసూయతో ఒకరికి చెడు తలపెట్టకూడదు. పొరుగువాని సొత్తును అశించకూడదు. ఇతరుల సొమ్మును ఆశించి దాన్ని సొంతం చేసుకోవటానికి తప్పుడు మార్గాలు ఎంచుకుంటాం. దానివల్ల మనం ద్రోహులుగా మిగిలిపోతాం. అలా కాకుండా అందరి దృష్టిలో మనం ఉత్తములుగా ఉండాలి అని ఈ ఆజ్ఞ చెబుతోంది.

దేవుని రాజ్యంలో పాదం మోపటానికే కాదు, ఈ లోకంలో మనం జీవిస్తున్నపుడు సమాజం దృష్టిలో మనం ఉత్తములుగా గుర్తింపు పొందటానికి కూడా దేవుని ఆజ్ఞలు మార్గం చూపుతున్నాయి. ఆజ్ఞలకు అతిక్రమించి పాపులుగా మిగిలిపోకుండా, వాటిని అనుసరిస్తూ దేవునికి ఇష్టులైన బిడ్డలుగా ఆయన దీవెనలందుకోవాలి. ఆ తండ్రి రాజ్యంలో స్థానం పొందాలి.

వెబ్దునియా పై చదవండి