కొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి నాడు కీరదోసను కూడా పూజలో పెడుతుంటారు. ఐతే శ్రీకృష్ణాష్టమి పండుగ రోజున కీరదోసకాయను కోయకుండానే పూజలో ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. పూజ పూర్తయిన తర్వాత, శ్రీకృష్ణుడి జన్మాన్ని సూచిస్తూ, దోసకాయ కాడను కత్తి లేదా నాణెంతో కోస్తారు. కీరదోసకాయకు ప్రాముఖ్యత ఎందుకంటే, కీరదోసకాయను తల్లి గర్భంగా భావిస్తారు. కాడతో సహా ఉన్న కీరదోసకాయను పూజలో ఉంచి, పూజ తర్వాత దాని కాడను కోయడం అనేది దేవకీ గర్భం నుండి శ్రీకృష్ణుడు జన్మించడాన్ని, బొడ్డుతాడు తెంచుకోవడాన్ని సూచిస్తుంది.
కొన్ని ప్రాంతాల్లో, కీరదోసకాయను మధ్యలో కోసి, అందులో శ్రీకృష్ణుడి బాల రూపాన్ని ఉంచి పూజిస్తారు. ఇది బాల గోపాలుడికి స్వాగతం పలకడానికి ప్రతీక. పూజ అనంతరం కోసిన దోసకాయను ప్రసాదంగా పంచుతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ ప్రసాదం తీసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇది సంతానం కోసం చేసే ప్రార్థనలకు కూడా సంబంధించింది.
కాబట్టి, కృష్ణాష్టమి రాత్రి కీరదోసకాయను పూజ చేసే ముందు కోయకూడదు, పూజ పూర్తయిన తర్వాత, సంప్రదాయబద్ధంగా కాడను వేరు చేస్తారు.