వేసవిలో పచ్చళ్ళను జాగ్రత్తగా ఎలా నిల్వచేసుకుంటున్నారు?
FILE
వేసవిలో పచ్చళ్ళను జాగ్రత్తగా ఎలా నిల్వచేసుకుంటున్నారు? వేసవిలో అందరూ మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళను తయారుచేస్తారు. వాటిలో ప్రధానంగా అందరూ తయారుచేసేది ఆవకాయ. ఈ పచ్చడిని ఈ కాలమే తయారుచేసుకోని సంవత్సరమంతా నిలవ వుంచుకోవాలి. సంవత్సరమంతా పచ్చడి పాడవకుండా వుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆవకాయకు వాడే మామిడికాయను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త అవసరం. పగిలిన కాయలు, మెత్తగా వున్నకాయలను ఆవకాయకు వాడకూడదు. మామిడికాయ తొక్క దళసరిగా, పీచు ఎక్కువగా వుంటే సంవత్సరమంతా ముక్క మెత్తగాకాకుండా వుంటుంది.
ఆవకాయలో కలిపే కారం, ఉప్పు, ఆవపిండిని కావలసిన పళ్ళాలో కలపాలి. ఆవకాయలో పచ్చిమెంతులు, శనగలు వేస్తే రుచిగా, సువాసనగా వుంటుంది. పచ్చడిలో ఏనూనెపడితే ఆ నూనె పోయకూడదు. బ్రాండెడ్ నువ్వుల నూనెకానీ పప్పునూనెకానీ వాడాలి.
ఆవకాయ కలిపాక గాలి తగలకుండా జాడీలో పెట్టి మూడవరోజు తిరగ కలిపి కొంచెం తీసుకోని అన్నంలో కలుపుకొని తిని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపడినంత వుండాలి. లేకపోతే వర్షాకాలం వచ్చేసరికి ఆవకాయ పాడైపోతుంది.
ఆవకాయను సీసాలు, ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టడం కన్నా జాడీల్లో పెడితేనే తాజాగా వుంటుంది. అవకాయ మునిగేలా నూనె పోస్తేనే సంవత్సరమంతా ఆవకాయ చెడిపోకుండా నిల్వ ఉంటుంది.