దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు మాస్కులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తుండడం, బహిరంగసభలు, సమావేశాల్లో పాల్గొంటుండడమే దీనికి కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీలగిరి కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఊటీలో మాస్క్ ధరించని వారికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామని నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్సెంట్ దివ్య హెచ్చరించారు.
ఊటీలోని ప్రజలు గానీ, పర్యాటకులు గానీ మాస్కులు ధరించకుండా సంచరిస్తే ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామన్నారు. మాస్కులు లేకుండా సంచరించే వారిని గుర్తించేందుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్కులు ధరించనివారి నుంచి ఇప్పటి వరకూ రూ.30.68 లక్షల జరిమానా వసూలు చేశామన్నారు.
కాగా, మాస్కు ధరించని వారికి ఆరు నెలల జైలుతోపాటు రూ.200 జరిమానా కూడా విధిస్తామని జిల్లా అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఏపీ, పుదుచ్చేరి, కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల నుంచి తమిళనాడు వచ్చేవారు తప్పనిసరిగా ఈపాస్ తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.