ఏపీ రాజ్‌భవన్‍లోకి అందువల్లే కరోనా వైరస్ ప్రవేశించిందా?

బుధవారం, 29 ఏప్రియల్ 2020 (17:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే 1332 కేసులు నమోదయ్యాయి. సచివాలయం, రాజ్‌భవన్ కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు.. కర్నూలు జిల్లా కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా ఉన్నాయి. అయితే, ఏపీ రాజ్‌భవన్‌లో నలుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్‌కు పరీక్షలు చేయగా, ఆయనకు ఫలితం నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.
 
అయితే, ఏపీ రాజ్‌భవన్‌లోకి కరోనా వైరస్ ప్రవేశించడానికి ప్రధాన కారణం ఏపీ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనరుగా బాధ్యతలు చేపట్టిన కనగరాజ్ అని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే, ఈయన చెన్నైవాసి. రాష్ట్ర ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించి, ఆయన స్థానంలో ఆగమేఘాలపై చెన్నై నుంచి విజయవాడకు తీసుకొచ్చి ఎస్ఈసీగా ఏపీ సర్కారు నియమించింది. ఆ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించడం, పిమ్మట రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలవడం క్షణాల్లో జరిగిపోయింది. 
 
నిజానికి కరోనా ప్రభావిత మెట్రో నగరాల్లో చెన్నై కూడా ఒకటి. చెన్నై నగరంలో ప్రతి రోజూ వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. పైగా, ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ అమలవుతోంది. ఈపరిస్థితుల్లో లాక్‌డౌన్ నిబంధనలకు తూట్లుపొడుస్తూ పొరుగు రాష్ట్రానికి చెందన వ్యక్తిని తీసుకొచ్చి ఎస్ఈసీగా నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలను విపక్ష నేతలు గుప్పిస్తున్నారు. పైగా ఈయన వల్లే ఏపీ రాజ్‌భవన్‌లోకి కరోనా వైరస్ ప్రవేశించిందంటూ విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.
 
వీటిపై ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే... పక్క రాష్ట్రంలో ఉండి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న టీడీపీ నేతలు ఇళ్లలో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేస్తుండటం దురదృష్టకరమన్నారు. 
 
రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ ప్రమాణస్వీకారం చేయబట్టే రాజ్‌భవన్‌కు కరోనా వైరస్ సోకిందని ఆరోపణలు చేస్తుండటం దారుణమన్నారు. ఇలాంటి ఆరోపణలు శోచనీయమని చెప్పారు. పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసే ధరలకే తమకూ కరోనా కిట్లను సరఫరా చేయాలని సదరు కంపెనీకి ముందే స్పష్టం చేశామని... ఇప్పుడు దీనిపై విచారణ ఎందుకని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు