ఆ ట్రక్కు డ్రైవర్లు చేసిన పనికి.. 40 మందికి వైరస్ సోకింది... ఎక్కడ?

ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:16 IST)
కరోనా వైరస్ ఎవరికి సోకిందో.. ఎవరికి సోకలేదో కూడా తెలియడం లేదు. చాలా మందికి ఈ వైరస్ సోకినప్పటికీ వారిలో కరోనా లక్షణాలు బయటపడటం లేదు. దీంతో వారు ఇతరులతో కలవడం వల్ల మరికొంతమందికి ఈ వైరస్ సోకుతోంది. తాజాగా ఇద్దరు ట్రక్కు డ్రైవర్లకు ఈ వైరస్ సోకింది. కానీ, ఈ విషయం వారిద్దరికి తెలియదు. దీంతో లాక్‌డౌన్ సమయంలో ఊరకే కూర్చోలేక తన స్నేహితులతో కలిసి ఓ డ్రైవర్ పేకాట ఆడాడు. అంతే.. తనతో కలిసి పేకాట ఆడిన 24 మందికి ఈ వైరస్ సోకింది. మరో డ్రైవర్ అనేక మందితో పిచ్చాపాటిగా కబుర్లు చెప్పాడు. దీంతో వారందరికీ ఈ వైరస్ అంటుంకుంది. ఈ రెండు ఘటనలు విజయవాడ నగరంలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇదే అంశంపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో తమ గమ్యస్థానాలకు చేరుకోలేని అనేక మంది డ్రైవర్లు జాతీయ రహదారుల వెంబడి చెట్ల కింద ఉంటున్నారు. అలాంటి వారిలో ఓ ట్రక్కు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఈయనకు వైరస్ సోకిన విషయం తెలియదు.
 
దీంతో ఊరికనే కూర్చుని, కూర్చుని బోర్ కొట్టింది. ఏం చేయాలో పాలుపోని ఈ ట్రక్ డ్రైవర్, చుట్టుపక్కల ఉన్న వారిని పేకాట ఆడేందుకు పిలిచాడు. వారితో కలిసి పేకాట ఆడాడు. తనలో కరోనా ఉందని తెలియకుండానే అతను చేసిన ఈ పని అతని ద్వారా మరో 24 మందికి వైరస్‌ను అంటించాడని ఇంతియాజ్ తెలిపారు. 
 
అలాగే, మరో ట్రక్కు డ్రైవర్ మరో 15 మందికి ఈ వైరస్ అంటించినట్టు తెలిపారు. ఈ రెండు ఘటనల కారణంగా గడచిన రెండు రోజుల్లో నగరంలో 40 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని ఇంతియాజ్ వెల్లడించారు. కృష్ణలంక ప్రాంతంలోని సదరు ట్రక్ డ్రైవర్ పేకాట ఆడాడని, కార్మిక నగర్ ప్రాంతంలో మరో ట్రక్ డ్రైవర్, కనిపించిన వారందరితోనూ కబుర్లు చెప్పాడని వ్యాఖ్యానించారు. భౌతిక దూరాన్ని పాటించడంలో వీరందరూ విఫలమైన కారణంగానే వైరస్ వ్యాప్తి జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
మరోవైపు, విజయవాడ ప్రాంతం, ఏపీలోనే పెద్ద హాట్ స్పాట్‌గా అవతరించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 10 శాతం... అంటే సుమారు 100 కేసులు ఇక్కడే నమోదయ్యాయి. ఈ పరిస్థితి మారాలంటే, ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా దూరదూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు