ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులుకారు. ప్రతి ఒక్కరిపై దాడి చేస్తోంది.
ఫలితంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు దుమ్మురేపుతున్నాయి. బుధవారం ఏకంగా సుమారుగా 11 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా ప్రకటన మేరకు... బుధవారం కొత్తగా 10,830 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,82,469కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్ కేసులున్నాయి. బుధవారం వరకు 2,86,720 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 3,541 మంది మృతి చెందారు.