దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే ముఖానికి మాస్క్ తప్పనిసరి అంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్న, తమ ఆర్థిక స్తోమతకు తగినట్టుగా మాస్కులు కొనుగోలు చేసి వాడుతున్నారు. అయితే, కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఎన్-95 మాస్క్ ఉత్తమమని వైద్యులు ఉంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్-95 మాస్క్ వాడటం వరకు బాగానే ఉంది. దాన్ని ఎలా శుభ్రం చేయాలి? సర్జికల్ మాస్క్ అయితే ధర తక్కువ కాబట్టి ఒక రోజు వాడి పారేస్తాం. బట్ట మాస్క్ అయితే ఒక్క రోజు వాడగానే శుభ్రంగా ఉతికి ఆరేస్తాం. అలా ఎన్-95 మాస్క్‌ను ఉతకవచ్చా? అసలు ఎన్95 మాస్క్‌ను ఉతక్కుండా ఎన్ని రోజులు వాడొచ్చు?
ఎన్95 మాస్కులు కరోనా వైరస్‌ను 95 శాతం వరకు సమర్థంగా అడ్డుకుంటాయి. కాకపోతే సర్జికల్, బట్ట మాస్కులతో పోలిస్తే వీటి ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా అని వీటిని ఉతికి వాడుకోవడం చేయొద్దు. వీటిని ఉతకడం వల్ల వడపోత సామర్థ్యం దెబ్బతింటుంది. అప్పుడు ఈ మాస్కులను ఉపయోగించిన ప్రయోజనం ఉండదు. ఎన్95 మాస్క్‌లను కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో మాత్రమే శుభ్రం చేస్తారు.