కరోనా వైరస్ సోకి బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మృతి
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (14:59 IST)
కరోనా వైరస్ సోకి బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మృత్యువాతపడ్డారు. ఇటీవల కరోనా వైరస్ బారినపడిన అరుణ్ కుమార్ సింగ్... పట్నాలోని ఓ అస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
నిజానికి దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రోజూ భారీసంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలా కరోనా కాటుకు బలవుతున్న వాళ్లలో సామాన్యులే కాదు పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఇలాంటి ప్రముఖుల్లో ఓ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా ఉండటం గమనార్హం.
అదేవిధంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
మరోవైపు, భారత్‌ను కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తున్న వేళ నిర్వహించిన మహాకుంభమేళాలో పాల్గొనడానికి హరిద్వార్‌కు మొత్తం 91 లక్షల మంది వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్ 27 మధ్య ఈ 91 లక్షల మంది గంగలో మునకేసినట్లు కుంభమేళ ఫోర్స్ తెలిపింది.
ఇందులో కేవలం ఏప్రిల్ నెలలోనే 60 లక్షల మంది రావడం గమనార్హం. అందులోనూ కేవలం ఏప్రిల్ 12న ఒక్కరోజే 35 లక్షల మంది రాగా.. అంతకుముందు శివరాత్రి సందర్భంగా మార్చి 11న 32 లక్షల భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
కుంభమేళా మొత్తం ముగిసిన తర్వాత బుధవారం నుంచి హరిద్వార్‌లో కర్ఫ్యూ విధించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు. హరిద్వార్‌తోపాటు రూర్కీ, లక్సర్, భగ్‌వాన్‌పూర్‌లలో కర్ఫ్యూ విధించారు.
కుంభమేళా సందర్భంగా 13 అఖాడాల నుంచి 2 వేల మంది సాధువులు గంగలో రాజ స్నానాలు చేయగా.. అందులో కొందరికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 30న ముగియాల్సిన ఈ కుంభమేళాను కరనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముందుగానే ముగించాలని ప్రధాని మోదీ కోరడంతో ఏప్రిల్ 17నే ముగిసినట్లు ప్రకటించారు.