దేశంలో కరోనా తొలి దశ వ్యాప్తి జనాల్లో వణుకు పుట్టించింది. అది తగ్గి.. జనాలు కాస్త రిలాక్స్ అయ్యారో లేదో ఇప్పుడు రెండో దశ వ్యాప్తి సనామీలా విరుచుకుపడింది. ప్రభుత్వాలను, ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతేడాది వచ్చిన కరోనా వేరియంట్ వృద్ధులపైనే ఎక్కువ ప్రభావం చూపగా.. ఇది చిన్నాపెద్దా లేకుండా అందర్నీ ఆడేసుకుంటుంది. దీంతో ప్రజల్లో భయాలు మరింత ఎక్కువయ్యాయి.
ముఖ్యంగా జనాల మెదళ్లలో ఎన్నో అనుమానాలు. మరెన్నో సందేహాలు తిరుగుతున్నాయి. అసలు సెకండ్ వేవ్‌కు ఫస్ట్ వేవ్‌కు తేడా ఏంటి.? వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకితే ఎలా? కరోనా వస్తే ఆస్పత్రుల్లో చేరాలా? ఇంటి దగ్గరే ఉంటే సరిపోదా? లక్షణాలు ఉన్నా కొంతమందికి నెగెటివ్ ఎందుకు వస్తుంది? ఇలా జనాల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. దీనిపై వైద్యులు తమ అభిప్రాయాలను వెల్లడించాు.
ముఖ్యంగా, కరోనా నిర్ధారణ అయిన మరుక్షణం నుంచే ఐసొలేషన్‌లోకి వెళ్లిపోవాలి. లేనిపక్షంలో ఒక రోగి ద్వారా సగటున 10 రోజుల్లో 140 మందికి వైరస్ సోకే ప్రమాదం ఉన్నది. డయాబెటిస్, బీపీ, గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్, హెచ్‌ఐవీ తదితర వ్యాధులున్నవారు కరోనా సోకినపుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇలాంటివారు వైద్యులను సంప్రదించి దవాఖానలో చేరితే మంచిది. ఇక లక్షణాలు లేనివారు, చాలా తక్కువ లక్షణాలున్నవారు ఇంట్లోనే పల్స్ ఆక్సీమీటర్ ద్వారా తమ ఆక్సిజన్ లెవల్స్‌ను చూసుకోవాలి. 95 కన్నా తక్కువైన పక్షంలో వెంటనే హాస్పిటల్‌లో చేరాలి.
వీరికి ఆక్సిజన్ సపోర్టు అవసరమవుతుంది. ఆస్తమా, శ్వాసకోశ రుగ్మతలు ఉన్నవారిలో ఆక్సిజన్ లెవల్ 92 వరకు ఉన్నా ఫర్వాలేదు. నిజానికి 85-90 శాతం మందికి దవాఖానలో అడ్మిషన్ అవసరం లేదు. కరోనా బారినపడ్డ వారిలో రాష్ట్రంలో 99 శాతం మంది కోలుకున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.