కోవిడ్ రూల్స్ పాటించడం లేదు.. లాక్డౌన్‌కు ప్లాన్ సిద్ధం చేయండి.. సీఎం ఉద్ధవ్

సోమవారం, 29 మార్చి 2021 (08:36 IST)
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. మహారాష్ట్రలో అయితే ఈ వ్యాప్తి తారా స్థాయికి చేరుకుంది. ఒక్కో రోజు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్లీ సంపూర్ణ లాక్డౌన్‌ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. 
 
ఈ మేరకు రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం సంకేతాలిచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే ప్రజలు మరో లాక్డౌన్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 
 
ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్‌ విధిస్తే మంచిదని అధికారులు ఉద్ధవ్‌కు సూచించగా.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్‌ విధిస్తే ప్రజలకు నిత్యావసరాలు, మందుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావం పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. దవాఖానాల్లో సౌకర్యాలపై ఆరాతీశారు. 
 
ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ప్ర‌దీప్ వ్యాస్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం 3.75 ల‌క్ష‌ల ఐసోలేష‌న్ బెడ్లు, 1.07 ల‌క్ష‌ల బెడ్లునిండిపోయాయ‌ని చెప్పారు. 60,349 ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా బెడ్లు ఉన్నాయ‌ని, వాటిలో 12,701 బెడ్ల‌పై రోగులు ఉన్నార‌న్నారు. మున్ముందు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగితే.. హెల్త్ కేర్ మౌలిక వ‌స‌తుల కొర‌త వెంటాడుతుంద‌ని చెప్పారు.
 
ఆదివారం అర్థ‌రాత్రి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లులోకి వ‌స్తుంది. దీని ప్ర‌కారం షాపింగ్ మాల్స్ రాత్రి ఎనిమిది గంట‌ల నుంచి ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు మూసే ఉంచుతారు. ప‌లు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే అధికారిక కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుండ‌టంతోపాటు ఆర్థిక లావాదేవీల‌కు అనుమ‌తిస్తున్న వేళ తిరిగి క‌రోనా కేసులు పెరుగ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. కాగా, దేశంలో రోజూ నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 60 శాతానికి పైగా మహారాష్ట్ర నుంచే ఉంటున్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు