లాక్ డౌన్ సమయంలో రెడ్ క్రాస్ సేవలు స్పూర్తిదాయకం: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

గురువారం, 25 మార్చి 2021 (19:31 IST)
విజయవాడ: కరోనా లాక్ డౌన్ వేళ రాష్ట్రంలో రెడ్ క్రాస్ అందించిన సేవలు స్పూర్తిదాయకంగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎపి స్టేట్ బ్రాంచ్ నిర్వహించిన సైకిల్ ర్యాలీ ముగింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు.
 
విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్, గవర్నర్ వారి కార్యదర్శి, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు ముఖేష్ కుమార్ మీనా పాల్గొనగా, నగరంలో ఎస్ఎస్ కన్వేన్షన్ నుండి రెడ్ క్రాస్ బాధ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అవగాహనా ర్యాలీ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, అనంతపూర్ నుండి వేరు వేరుగా విజయవాడకు చేరుకున్న సైకిలిస్టు బృందాలను స్వాగతించిన గవర్నర్ వారిని అభినందించారు.
 
గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ రక్తదానంతో జీవితాలను కాపాడవచ్చని, చెట్ల పెంపకం, పరిశుభ్రమైన వాతావరణంతో ఆరోగ్యకరమైన జీవితం సాధించవచ్చని ఈ ఇతివృత్తాలతో సైకిల్ ర్యాలీని విజయవంతం చేయటం శుభపరిణామమన్నారు. జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ విభాగాలు ఈ ర్యాలీలో కీలక భూమికను పోషించటం పలువురికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. యువతలో నాయకత్వ నైపుణ్యాలను వెలికీతీస్తూ, బృంద సూర్తిని చాటేలా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రెడ్ క్రాస్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.కె. పరిడాలను గవర్నర్ అభినందించారు. జిల్లాల వారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్లు, రెడ్ క్రాస్ జిల్లా శాఖల అధ్యక్షులు, పోలీసు అధికారులు, ఇతర కార్యనిర్వాహకుల సేవలు వెలకట్టలేనివని గవర్నర్ ప్రస్తుతించారు.
 
కరోనా సంక్షోభ సమయంలో రెడ్‌క్రాస్ వాలంటీర్లు చేసిన సేవలను గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఐఆర్‌సిఎస్ యూనిట్లు ఆహారం, కూరగాయలు, ముఖ ముసుగులు, చేతి తొడుగులు, శానిటైజర్‌లు పంపిణీ చేయడం ద్వారా తమ సేవలు అందించి సంక్షోభ సమయంలో తమదైన స్పందనను ప్రదర్శించారన్నారు. వాలంటీర్లు వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకునేలా రవాణా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని సహాయం చేశారన్నారు. గత సంవత్సరం 13 లక్షల జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ వాలంటీర్లు సభ్యత్వం పొందినట్లు ఐఆర్‌సిఎస్ ఎపి స్టేట్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ ఎ. శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు